Rahul Gandhi: విదేశాల్లో భారత్‌ పరువు తీసింది మోదీనే.. నేను కాదు..!

విదేశాల్లో భారత్ పరువు తీసే ఉద్దేశం తనకు లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) అన్నారు. కేంబ్రిడ్జిలో తన ప్రసంగంపై భాజపా చేసిన విమర్శలను తిప్పికొట్టారు. 

Updated : 06 Mar 2023 11:13 IST

దిల్లీ:  భారత్‌ గురించి ప్రపంచమంతా కీర్తిస్తుంటే.. ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ((Rahul Gandhi) విదేశీ గడ్డపై దేశాన్ని అవమానించేలా మాట్లాడుతున్నారంటూ భాజపా(BJP) నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమలం నేతలనుంచి వచ్చిన ఈ విమర్శలను రాహుల్ తిప్పికొట్టారు. ‘నాకు గుర్తున్నాయ్‌’ అంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. 

‘స్వాతంత్య్రం వచ్చిన 60 నుంచి 70 ఏళ్లలో ఏ అభివృద్ధి జరగలేదని విదేశాల్లో ప్రధాని మోదీ(Modi) ప్రకటించడం నాకు గుర్తుంది. ఆ కాలంలో అపరిమిత స్థాయిలో అవినీతి జరిగిందని ఆయన చెప్పడం నాకు గుర్తుంది. నేనెప్పుడు నా దేశం పరువు తీయలేదు. అలా చేయాలన్న ఆసక్తి కూడా నాకు లేదు. నా మాటలను వక్రీకరించడం భాజపాకు ఇష్టం. ఫర్వాలేదులే..! కానీ విదేశాలకు వెళ్లినప్పుడు భారత్ పరువు తీసే వ్యక్తి ప్రధాని అనేది మాత్రం వాస్తవం. స్వాతంత్య్రం వచ్చిన దగ్గరి నుంచి దేశంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదంటూ ఆయన చేసిన ప్రసంగం మీరు వినలేదా..? ఆ మాటలతో ఆయన భారతీయులను అవమానించారు ’అంటూ రాహుల్‌ స్పందించారు.

ఎలాంటి నిర్ణయాలు తీసుకోని గత ప్రభుత్వం నుంచి వచ్చిన సమస్యలున్నాయంటూ 2015లో దుబాయ్‌లో మోదీ చేసిన వ్యాఖ్యలను అప్పట్లో కాంగ్రెస్ తీవ్రంగా తప్పుపట్టింది. ‘గతంలో భారతీయులు ఇక్కడ జన్మించినందుకు చింతిస్తూ.. దేశం విడిచివెళ్లిపోయే పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం మాత్రం ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే ఆదాయం తక్కువైనా తిరిగి స్వదేశానికి రావడానికే మొగ్గుచూపుతున్నారు. ప్రజల ఆలోచన మారింది’ అంటూ అదే ఏడాది విదేశీ గడ్డపై మోదీ(Modi) వ్యాఖ్యలు చేశారు. 

కాగా..  భారత్‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ కాంగ్రెస్‌ నేత (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై భాజపా (BJP) మండిపడింది.  బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో ప్రసంగిస్తూ రాహుల్‌ చేసిన వ్యాఖ్యలను ఆక్షేపించింది. పొరుగు దేశం పాక్‌ సైతం ఎప్పుడూ ఆ సాహసం చేయలేదని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని