Rahul Gandhi: నేడు మీడియా ముందుకు రాహుల్‌ గాంధీ.. ఏం చెప్పనున్నారు..?

అనర్హత వేటుకు గురైన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఈ మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ఏం ప్రకటిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

Updated : 25 Mar 2023 11:32 IST

దిల్లీ: పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడిన కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)పై అనర్హత వేటు (Disqualification) వేయడం దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. కేంద్రం తీరుపై విపక్షాలు భగ్గుమన్నాయి. ఈ పరిణామాల అనంతరం రాహుల్‌ గాంధీ తొలిసారిగా నేడు మీడియా ముందుకు రానున్నారు. శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రత్యేక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడనున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ నేడు ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. దీంతో అనర్హత వేటుపై రాహుల్‌ ఏం చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది. (Rahul Gandhi Press Meet)

మోదీ ఇంటిపేరును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై నమోదైన పరువునష్టం (క్రిమినల్‌) కేసులో సూరత్‌ కోర్టు గురువారం రాహుల్‌ (Rahul Gandhi)కు రెండేళ్ల జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు వెలువడిన 24 గంటల్లోపే లోక్‌సభ సచివాలయం రాహుల్‌పై చర్యలు తీసుకుంది. ప్రజాప్రాతినిధ్య చట్టం కింద.. ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఈ మేరకు నిన్న నోటిఫికేషన్‌ జారీ చేసింది. అనర్హత (Disqualification)పై రాహుల్‌ నిన్న ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘‘నేను దేశ ప్రజల వాణిని వినిపించేందుకు పోరాడుతున్నాను. ఎంత మూల్యమైనా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా’’ అని ఆయన ట్వీట్‌ చేశారు.

అప్పీల్‌ ఎప్పుడు చేస్తారు..?

రాహుల్‌గాంధీ (Rahul Gandhi)కి రెండేళ్ల జైలుశిక్ష ఖరారవడం, ఆయనపై లోక్‌సభ సచివాలయం అనర్హత వేటు వేయడం చకచకా జరిగిపోయాయి. తర్వాత ఏం జరగబోతోందన్నదానిపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. సూరత్‌ కోర్టు తీర్పుపై రాహుల్‌ ఇప్పుడు పైకోర్టులో అప్పీల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనిపై ఆయన ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అక్కడ స్టే వస్తే అనర్హత వేటు తొలగిపోయే అవకాశాలున్నాయి. దీంతో రాహుల్‌ పైకోర్టులకు వెళ్తారా లేదా అన్నదానిపైనా సందిగ్ధత నెలకొంది.

వయనాడ్‌ సీటుకు ఉప ఎన్నిక..?

రాహుల్‌పై అనర్హత వేటు పడటంతో ఆయన ప్రాతినిధ్యం వహించిన కేరళలోని వయనాడ్‌ (Wayanad) నియోజకవర్గం ఖాళీ అయ్యింది. ఇప్పుడు ఆ స్థానానికి ఈసీ ఉప ఎన్నిక నిర్వహించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల కానుంది. ఆ సమయంలోనే ఉప ఎన్నికలకు కూడా తేదీ ప్రకటించే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అభిషేక్‌ మను సింఘ్వీ మాట్లాడుతూ.. ‘‘ఈసీ నుంచి ఆ నిర్ణయం వెలువడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే అలా ప్రకటిస్తే మేం న్యాయపరంగా ముందుకెళ్తాం’’ అని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని