Rahul Gandhi: మోదీ ప్రధాని కావడం కష్టమే.. ఇది నా గ్యారంటీ: రాహుల్‌

అగ్నిపథ్‌ పథకం అమలుతో ప్రధాని మోదీ.. దేశ సైనికులను ఘోరంగా అవమానించారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. 

Published : 27 May 2024 18:31 IST

పట్నా: కేంద్రంలోని మోదీ సర్కార్‌పై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) మరోసారి విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో భాజపా (BJP) ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. తనను తాను నిజమైన దేశభక్తుడిగా ప్రకటించుకుంటున్న ప్రధాని మోదీ(PM Modi).. అగ్నిపథ్‌ పథకంతో జవాన్లను అవమానించారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బిహార్‌లోని పాలిగంజ్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్‌.. కేంద్రంలోని భాజపాపై విరుచుకుపడ్డారు.

దేశం కోసం భగవంతుడు తనను ఇక్కడికి పంపించాడని ప్రధాని మోదీ వ్యాఖ్యానించడంపై రాహుల్‌ మండిపడ్డారు. ‘‘సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు. తానొక నిజమైన దేశభక్తుడిని అంటూ మోదీ ప్రజలను నమ్మిస్తున్నారు. కానీ, అగ్నివీర్‌ పథకాన్ని అమలుచేసి సైనికులను ఘోరంగా అవమానించారు. ఆయన మళ్లీ ప్రధాని కావడం కష్టమే. ఇది రాహుల్‌ గ్యారంటీ. రాజ్యాంగ మార్పుకు కాషాయ పార్టీ పన్నుతున్న కుట్రను అడ్డుకుంటాం’’ అని రాహుల్‌ దుయ్యబట్టారు.

‘నాలుగేళ్లుగా నిద్రపోయారా? మీపై నమ్మకం లేదు’ - గుజరాత్‌ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

దేశవ్యాప్తంగా తమ కూటమికి ప్రజాదరణ లభిస్తోందని.. ఎన్నికల్లో తాము విజయం సాధిస్తామని రాహుల్‌ ధీమా వ్యక్తంచేశారు. ‘‘ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అగ్నిపథ్‌ పథకాన్ని తొలగిస్తాం. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న 30 లక్షల ఖాళీలను భర్తీ చేస్తాం. నెలనెలా ప్రతీ మహిళా బ్యాంకు ఖాతాలో రూ.8,500 జమ చేస్తాం’’ అని హామీ ఇచ్చారు. 

కుంగిన ప్రచార వేదిక.. పట్టు కోల్పోయిన రాహుల్‌

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమార్తె మిసా భారతి పాటలీపుత్ర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె తరఫున ప్రచారంలో రాహుల్‌ పాల్గొన్నారు. ఈ క్రమంలో స్టేజీ కాస్త కుంగింది. దీంతో రాహుల్‌ పట్టుకోల్పోతుండగా.. పడిపోకుండా భారతి సాయం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని