Game zone fire: ‘నాలుగేళ్లుగా నిద్రపోయారా? మీపై నమ్మకం లేదు’ - గుజరాత్‌ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

రాజ్‌కోట్‌ వీడియో గేమ్‌ జోన్‌ అగ్నిప్రమాద ఘటనకు సంబంధించి అక్కడి మునిసిపల్‌ అధికారుల తీరుపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.

Updated : 27 May 2024 20:53 IST

గాంధీనగర్‌: గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ వీడియో గేమ్‌జోన్‌ అగ్ని ప్రమాద ఘటనలో 28 మంది ఆహుతైన విషయం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదం నింపింది. అందులో చిన్నారులు ఉండటం, వారంతా గుర్తించలేనివిధంగా కాలిపోవడం తీవ్రంగా కలచివేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో స్థానిక మునిసిపల్‌ అధికారుల తీరుపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. అమాయకుల ప్రాణాలు కోల్పోయిన తర్వాత చర్యలు చేపడతామని చెబుతోన్న రాష్ట్ర యంత్రాంగంపై తమకు విశ్వాసం లేదని పేర్కొంది.

అగ్నిప్రమాదం కేసుపై గుజరాత్‌ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈసందర్భంగా రాజ్‌కోట్ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (ఆర్‌ఎంసీ) అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడింది. ‘‘మీ పరిధిలో ఇంతటి భవనం ఉందని మీకు తెలియదా? కళ్లు మూసుకున్నారా? ఫైర్‌ సేఫ్టీ లేకుండా రెండున్నరేళ్లుగా ఇది ఉందని ఎలా చెబుతారు. టికెట్‌ వసూలు చేసేటప్పుడు వినోద పన్ను గురించి తెలియదా?’’ అని జస్టిస్‌ బైరెన్‌ వైష్ణవ్‌, జస్టిస్‌ దేవాన్‌దేశాయ్‌లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. ఆ భవనం ప్రారంభ కార్యక్రమంలో మునిసిపల్‌ కమిషనర్‌ కూడా పాల్గొన్నట్లు మీడియా కథనాలను చూపిస్తూ.. ఆ అధికారులు ఎవరు? వాళ్లంతా ఆడుకోవడానికి అక్కడికి వెళ్లారా? అని ప్రశ్నించారు.

Rajkot: మొదటి అంతస్తు నుంచి దూకేశాం...

ఆ గేమ్‌ జోన్‌ ఏర్పాటైనప్పటి (2021) నుంచి ఈ ప్రమాదం జరిగినంతవరకు రాజ్‌కోట్‌ కమిషనర్లుగా పనిచేసినవారంతా ఈ విషాదానికి బాధ్యత వహించాల్సిందేనని హైకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది. వారంతా వేర్వేరుగా అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. అనుమతుల కోసం టీఆర్‌పీ గేమ్‌ జోన్‌ తమను సంప్రదించలేదంటూ ఆర్‌ఎంసీ తరఫు న్యాయవాది వివరించే సమయంలో హైకోర్టు ధర్మాసనం ఈ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

ఈ దురదృష్టకర సంఘటన నేపథ్యంలో.. దీనికి ఓ వ్యక్తిని బాధ్యుడిని చేసేందుకు ప్రభుత్వం ముందుకురావాలని, అప్పుడే కఠిన చర్యలు తీసుకోవచ్చని తెలిపింది. పిటిషనర్‌ చేసిన విన్నపంపై ధర్మాసనం స్పందిస్తూ..‘‘ కఠిన చర్యలు ఎవరు తీసుకుంటారు? రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంపై మాకు నమ్మకం లేదు. మేం ఆదేశాలిచ్చిన నాలుగేళ్ల తర్వాత కూడా.. ఇలా జరగడం ఇది ఆరోసారి. ప్రాణాలు కోల్పోవడాన్నే వాళ్లు కోరుకుంటారు. ఆ తర్వాత యంత్రాంగాన్ని పురమాయిస్తారు. ఫైర్‌ సేఫ్టీకి సంబంధించి ఓ పిల్‌పై గతంలో ఇచ్చిన ఆదేశాలపై ఏం చేశారు. నెలలుగా కార్పొరేషన్‌ ఏం చేస్తోంది’ అని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఉన్నతాధికారులపై బదిలీ వేటు..

అగ్నిప్రమాద ఘటనలో అధికారుల నిర్లక్ష్యంపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. రాజ్‌కోట్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ చీఫ్‌ ఆనంద్‌ పటేల్‌, స్థానిక పోలీస్‌ కమిషనర్‌ రాజు భార్గవతోపాటు ఏసీపీ విధి చౌధరీ, డీసీపీ సుధీర్‌కుమార్‌ దేశాయ్‌లపై బదిలీ వేటువేసింది. ఈ ప్రమాదంలో అధికారుల నిర్లక్ష్యంపై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన గంటల వ్యవధిలో ఈ చర్యలు తీసుకోవడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని