Railway Track: అధిక ఉష్ణోగ్రతలకు పక్కకు జరిగిన రైలు పట్టాలు.. తృటిలో తప్పిన ప్రమాదం!

అధిక ఉష్ణోగ్రతల కారణంగా యూపీ (Uttar Pradesh)లో రైలు పట్టాలు (Railway Track) పక్కకు జరిగాయి. ఈ విషయాన్ని గమనించిన నిలాంచల్‌ ఎక్స్‌ప్రెస్ (Nilanchal Express) లోకో పైలట్‌ రైలును నిలిపివేయడంతో ఘోర ప్రమాదం తప్పింది. 

Updated : 18 Jun 2023 20:10 IST

లఖ్‌నవూ: లోకో పైలట్‌ అప్రమత్తతతో ఉత్తర ప్రదేశ్‌ (Uttra Pradesh)లో రైలు ప్రమాదం తప్పింది. లఖ్‌నవూ (Lucknow) దగ్గర్లోని నిగోహన్‌ (Nigohan ) రైల్వేస్టేషన్‌లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా రైలు పట్టాలు ( Railway Track) పక్కకు జరిగాయి. ఆ సమయంలో ట్రాక్‌పై వస్తున్న నీలాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌ (Nilanchal Express) లోకో పైలట్‌ రైలు పట్టాలు పక్కకు జరిగిన విషయాన్ని గుర్తించి కొద్ది దూరంలో రైలును నిలిపివేశారు. అనంతరం స్టేషన్‌ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో రైల్వే స్టేషన్‌ సిబ్బంది ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. ఒకవేళ లోకో పైలట్‌ పట్టాలు పక్కకు జరిగిన విషయాన్ని గుర్తించకుంటే.. ఘోర ప్రమాదం జరిగి ఉండేదని రైల్వే సిబ్బంది తెలిపారు. 

శనివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా నిగోహన్‌ స్టేషన్‌లో మెయిన్‌ లైన్‌ రైలు పట్టాలు పక్కకు జరిగాయి. ఆ సమయంలో నిలాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌ లోక్‌ పైలట్‌ దీన్ని గమనించి  కంట్రోల్‌ రూమ్‌కు వెంటనే సమాచారం అందించాడు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది.. రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. ఈ ఘటనపై లోకో పైలట్‌ లఖ్‌నవూ జంక్షన్‌కు చేరుకున్న వెంటనే రైల్వే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. నిగోహన్‌ రైల్వే స్టేషన్‌లో పట్టాలను పరిశీలించిన ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. అనంతరం ట్రాక్‌ పునరుద్ధరణ పనులు చేపట్టారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ట్రాక్‌ నిర్వహణ సరిగా చేపట్టకపోవడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తి ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని