ఆ ₹లక్ష చోరీతో రైల్వేకు సంబంధం లేదు: 18 ఏళ్ల నాటి కేసులో సుప్రీం తీర్పు

Theft in Rail: 18 ఏళ్ల కిందట ఓ వ్యక్తి రైల్లో ప్రయాణిస్తుండగా చోరీకి గురయ్యాడు. దీంతో పరిహారం కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. అయితే ఆ చోరీకి రైల్వేతో సంబంధం లేదని సుప్రీంకోర్టు తాజాగా స్పష్టం చేసింది.

Published : 16 Jun 2023 16:42 IST

దిల్లీ: రైలు ప్రయాణంలో వ్యక్తి పోగొట్టుకున్న డబ్బుతో రైల్వే (Railway)కు ఎలాంటి సంబంధం లేదని సుప్రీంకోర్టు (Supreme Court) తేల్చి చెప్పింది. ఈ కేసులో బాధిత ప్రయాణికుడికి పరిహారం చెల్లించాలన్న కన్స్యూమర్‌ కోర్టు ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం పక్కనబెట్టింది. ఈ మేరకు 18 ఏళ్ల నాటి కేసులో కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. అసలేం జరిగిందంటే..

సురేంద్ర భోళా అనే వస్త్రాల వ్యాపారి 2005లో రైల్లో వెళ్తుండగా ఆయన వద్ద ఉన్న రూ.లక్ష నగదు చోరీ (Theft)కి గురైంది. కన్ఫామ్డ్‌ టికెట్‌తో కాశీ విశ్వనాథ్‌ ఎక్స్‌ప్రెస్‌లో దిల్లీ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో సురేంద్ర దిల్లీలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆ చోరీకి రైల్వే పరిహారం చెల్లించాలంటూ కన్స్యూమర్‌ కోర్టు (consumer court )ను ఆశ్రయించారు. దీనిపై గతంలో విచారణ జరిపిన వినియోగదారుల ఫోరమ్‌.. బాధిత ప్రయాణికుడికి ₹లక్ష పరిహారం చెల్లించాల్సిందేనని రైల్వేను ఆదేశించింది.

దీన్ని సవాల్‌ చేస్తూ రైల్వే శాఖ 2015లో జిల్లా, జాతీయ కన్స్యూమర్‌ కమిషన్‌లో అప్పీల్‌ చేసింది. ప్రయాణికుల వ్యక్తిగత వస్తువులకు తాము బాధ్యత వహించబోమని తెలిపింది. అయితే అక్కడ ఊరట లభించకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సుప్రీంకోర్టులో జస్టిస్‌ విక్రమ్‌ నాథ్, జస్టిస్‌ అసనుద్దీన్‌ అమనుల్లాతో కూడిన ధర్మాసనం తాజాగా విచారణ జరిపింది.

ఈ సందర్భంగా రైల్వే (Railway) తరఫున న్యాయవాది తమ వాదనలు వినిపిస్తూ.. సదరు ప్రయాణికుడు తన డబ్బును బెల్టులో దాచి నడుముకు కట్టుకున్నాడని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. వాదోపవాదాలు విన్న ధర్మాసనం.. ఈ కేసులో కన్స్యూమర్‌ కమిషన్‌ ఇచ్చిన తీర్పును పక్కనబెట్టింది. ఇది రైల్వే లోపం కాదని తెలిపింది. ‘‘ప్రయాణికుడు తన సొంత వస్తువులను కాపాడుకోలేకపోతే.. దానికి రైల్వే బాధ్యత వహించదు’’ అని తేల్చిచెప్పింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని