Railways: రైల్వేలో సరకు రవాణా.. 8 నెలల్లోనే రూ.లక్ష కోట్ల ఆదాయం

సరకు రవాణాలో భారతీయ రైల్వే దూసుకుపోతోంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఎనిమిది నెలల్లోనే రూ.లక్ష కోట్ల ఆదాయం పొందినట్లు వెల్లడించింది.

Published : 02 Dec 2022 00:07 IST

దిల్లీ: కొవిడ్‌ అనంతరం రైలు ప్రయాణాలు, సరకు రవాణా మునుపటి స్థాయిలో పుంజుకుంటున్నాయి. సరకు రవాణాలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం నవంబరు వరకు 16శాతం పెరుగుదల కనిపించినట్లు భారతీయ రైల్వే (Indian Railways) వెల్లడించింది. 2022-2023 ఆర్థిక సంవత్సరం మొదటి ఎనిమిది నెలల్లోనే రూ.1,05,905 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపింది. గతేడాది మాత్రం రూ.91,127 కోట్లు వచ్చినట్లు పేర్కొంది.

రైళ్లలో ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ వరకు 978.72 మెట్రిక్‌ టన్నుల సరకు రవాణా జరిగింది. గతేడాది 903.16 మెట్రిక్‌ టన్నులుగా ఉండగా.. సుమారు 8శాతం వృద్ధి కనబరిచింది. ఈ ఏడాది కేవలం ఒక్క నవంబర్‌లోనే 123.9 మెట్రిక్‌ టన్నుల సరకు రవాణా చేయగా గతేడాదితో పోలిస్తే ఐదు శాతం పెరిగింది. రైల్వేలో సరకు రవాణాను మరింత వృద్ధి చెందేందుకు ప్రవేశ పెట్టిన ‘హంగ్రీ ఫర్‌ కార్గో’ పథకం ఎంతగానో దోహదపడుతోందని భారతీయ రైల్వే వెల్లడించింది.

దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ సమయంలో ప్రయాణికుల సర్వీసులు రద్దు కావడంతో సరకు రవాణాపై భారతీయ రైల్వే దృష్టి పెట్టింది. కొవిడ్‌ విజృంభణ తీవ్రంగా ఉన్న సమయంలో 2020 ఏప్రిల్‌లో 1209 మెట్రిక్‌ టన్నుల సరకు రవాణా చేసింది. గతేడాది ఆర్థిక సంవత్సరంలో మొత్తం 1400 మెట్రిక్‌ టన్నుల రవాణా చేయగా.. 2023-24లో దీన్ని 2000 మె.టన్నులకు పెంచుకోవాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని