New Districts: 19 కొత్త జిల్లాలు, మూడు డివిజన్లకు రాజస్థాన్‌ కేబినెట్‌ ఆమోదం

19 కొత్త జిల్లాల ఏర్పాటుకు రాజస్థాన్‌ కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. దీంతో అక్కడ మొత్తం జిల్లాల సంఖ్య 50కి చేరింది.

Published : 04 Aug 2023 21:12 IST

జైపూర్‌: రాజస్థాన్‌ కేబినెట్‌(Rajasthan Cabinet) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా 19 జిల్లాలు, మూడు డివిజన్ల ఏర్పాటుపై ఉన్నత స్థాయి కమిటీ చేసిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. దీంతో  రాజస్థాన్‌లో మొత్తం జిల్లాల సంఖ్య 50కి చేరుతుందని అదనపు చీఫ్‌ సెక్రటరీ (రెవెన్యూ) అపర్ణా అరోడా తెలిపారు. కొత్త జిల్లాలను త్వరలోనే నోటిఫై చేయనున్నట్టు చెప్పారు. కేబినెట్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో జైపూర్‌ జిల్లా జైపూర్‌, జైపూర్‌ రూరల్‌గా; అలాగే, జోధ్‌పూర్‌ జిల్లా జోధ్‌పూర్‌, జోధ్‌పూర్‌ రూరల్‌ జిల్లాలుగా ఏర్పాటు కానున్నాయి. అలాగే, కొత్తగా బన్సవారా, పాలి, సికర్‌లను డివిజన్లుగా ఏర్పాటు చేయడంతో మొత్తం డివిజన్ల సంఖ్య 10కి చేరింది. 

రాష్ట్రంలో కొత్తగా 19 జిల్లాలు, మూడు రెవెన్యూ డివిజన్లను ఏర్పాటుపై రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ మార్చి నెలలోనే అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. దీనిపై అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ తాజాగా ఇచ్చిన నివేదికపై చర్చించిన మంత్రి వర్గం ఆమోదముద్ర వేసింది. కేబినెట్‌ భేటీ అనంతరం సీఎం గహ్లోత్‌ మీడియాతో మాట్లాడారు. కొత్త జిల్లాల ఇంఛార్జి మంత్రులు ఆగస్టు 7న అధికారికంగా ప్రారంభిస్తారని తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో పరిపాలన మెరుగుపడటంతో పాటు వివిధ పనుల నిమిత్తం జిల్లా కేంద్రాలకు వెళ్లే ప్రజలకు ఉపశమనం కలుగుతుందన్నారు. ప్రజలకు సుపరిపాలన అందించే దిశగా ఇది రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న మరో అడుగన్నారు. అలాగే, ఉన్నత స్థాయి కమిటీ గడువును మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్టు ప్రకటించిన సీఎం..  ప్రజలు తమ సలహాలు, సూచనల్ని ఆ కమిటీకి పంపించవచ్చని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని