Rajasthan: మంత్రికి సీఎం గహ్లోత్ షాక్‌.. కేబినెట్‌ నుంచి ఉద్వాసన

రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి అసెంబ్లీలో సొంత ప్రభుత్వాన్నే లక్ష్యంగా చేసుకొని మాట్లాడిన రాజస్థాన్‌ మంత్రి రాజేంద్ర సింగ్‌ గుడాను పదవి నుంచి తొలగిస్తూ సీఎం అశోక్‌ గహ్లోత్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. 

Updated : 22 Jul 2023 00:04 IST

జైపూర్‌: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి అసెంబ్లీలో సొంత ప్రభుత్వాన్నే లక్ష్యంగా చేసుకొని మాట్లాడిన మంత్రి రాజేంద్ర సింగ్‌ గుడాను మంత్రి పదవి నుంచి తొలగించారు. పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి సహా పలు శాఖల బాధ్యతలు చూస్తున్న రాజేంద్ర గుడా అసెంబ్లీలో సమావేశాల్లో మణిపుర్‌ అంశంపై మాట్లాడారు. మణిపుర్‌లో హింసను తన సహచరులు నిరసిస్తున్నప్పటికీ.. మహిళలపై నేరాలను అదుపుచేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పనితీరును ఆయన అసెంబ్లీ వేదికగా ప్రశ్నించారు. మహిళలపై జరుగుతున్న దాడుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. సొంత పార్టీ మంత్రే ఇలా మాట్లాడడంతో సీఎం గహ్లోత్‌ ఆయనను మంత్రి వర్గం నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆదాయం గ్యారంటీ బిల్‌ 2023 సందర్భంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మణిపుర్‌ ఘటనపై ప్రశ్నలు లేవనెత్తారు. ఈ సందర్భంగా మంత్రి గుడా మట్లాడుతూ.. ‘‘నిజం చెప్పాలంటే మహిళలకు రక్షణ కల్పించడంలో మనం విఫలమయ్యాం. రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగాయి. మణిపుర్‌ ఘటనపై మనం ప్రశ్నలు లేవనెత్తేముందు తొలుత మన రాష్ట్రంలో జరుగుతున్న తీరును ఆత్మపరిశీలన చేసుకోవాలి’’ అని మంత్రి రాజేంద్ర సింగ్‌ గుడా అన్నారు. దీంతో విపక్ష భాజపా ఒక్కసారిగా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విరుచుకుపడింది. రాష్ట్ర మంత్రే స్వయంగా ఈవిషయంపై మాట్లాడుతున్నాడంటే ఇది ప్రభుత్వం మాట్లాడినట్లే. ప్రభుత్వ తీరును స్వయంగా మంత్రి బట్టబయలు చేశారు. ఈ విషయాన్ని లేవనెత్తినందుకు మంత్రికి కృతజ్ఞతలు కానీ ఇది అవమానకర విషయం అని భాజపా పేర్కొంది. ఈ ఘటనతో మంత్రి గుడా తీరుపై సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే ఆయనను మంత్రి వర్గం నుంచి తొలగించాలని నిర్ణయించారు. ఈ మేరకు గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రాకు సీఎం గహ్లోత్‌ సిఫారసు చేశారు. దీంతో వెంటనే గవర్నర్‌ ఆమోదం తెలిపారని రాజస్థాన్‌ రాజ్‌భవన్‌ అధికార ప్రతినిధి తెలిపారు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని