Royal Family dispute: భార్య, కుమారుడు వేధిస్తున్నారు, భరణం ఇప్పించండి - మాజీ మంత్రి వేడుకోలు

తన భార్య మాజీ ఎంపీ దివ్యా సింగ్‌, తనయుడు అనిరుధ్‌ తనని వేధిస్తున్నారంటూ రాజస్థాన్‌ మాజీ మంత్రి విశ్వేంద్ర సింగ్‌ వాపోయారు.

Published : 19 May 2024 20:45 IST

జైపుర్‌: రాజస్థాన్‌లో భరత్‌పుర్‌ రాజకుటుంబంలో మళ్లీ రగడ మొదలైంది. మాజీ ఎంపీ దివ్యా సింగ్‌, తనయుడు అనిరుధ్‌ తనని వేధిస్తున్నారంటూ మాజీ మంత్రి విశ్వేంద్ర సింగ్‌ వాపోయారు. తనపై దాడి చేశారని, సరైన తిండి కూడా పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తనకు భరణం ఇప్పించాలని కోరుతూ స్థానిక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే, విశ్వేంద్ర వాదనలను తోసిపుచ్చిన భార్య, కుమారుడు.. ఈ వ్యవహారంలో తామే అసలైన బాధితులమని పేర్కొన్నారు.

‘మోతీ మహల్‌ నుంచి బలవంతంగా బయటకు పంపారు. ఒకే జత దుస్తులతో ఉంటున్నా. హృద్రోగ సమస్య ఉంది. సంచారిగా జీవిస్తున్నా. ఓసారి ప్రభుత్వ వసతి గృహంలో, కొన్నిసార్లు హోటల్లో ఉండాల్సి వస్తోంది. భరత్‌పుర్‌కు వస్తే ఇంట్లోకి అనుమతించడం లేదు. భార్య, కుమారుడు కలిసి నన్ను చంపేందుకు కుట్ర పన్నుతున్నారు. ఆ తర్వాత ఆస్తి మొత్తం స్వాధీనం చేసుకోవచ్చని భావిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ నాపై దుష్ప్రచారం చేస్తున్నారు’ అని పేర్కొంటూ స్థానిక న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తనకు నెలకు రూ.5లక్షల భరణంతోపాటు మోతీ మహల్‌ను తిరిగి ఇప్పించాలని డిమాండ్‌ చేశారు.

తనను కొట్టడంతోపాటు ఆహారం ఇవ్వడం లేదని విశ్వేంద్ర సింగ్‌ చేసిన ఆరోపణలను కుమారుడు అనిరుధ్‌ తోసిపుచ్చారు. ‘‘ఇది న్యాయస్థానంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నమే తప్పితే మరొకటి కాదు. స్థానిక కోర్టుపై పూర్తి విశ్వాసం ఉంది. తమ దగ్గర ఉన్న ఆధారాలన్నింటినీ కోర్టులో అందజేస్తాం. ఈ వ్యవహారం కొత్తేమీ కాదు. ఈ ఏడాది మార్చి 6 నుంచి ఈ గొడవ నడుస్తోంది’ అని విశ్వేంద్ర తనయుడు అనిరుధ్‌ సింగ్‌ సోషల్‌ మీడియా వేదికగా పేర్కొన్నారు. రాజకుటుంబం, రాజకీయ నేపథ్యమున్న కుటుంబంలో మళ్లీ గొడవలు మొదలుకావడం స్థానికంగా మరోసారి చర్చనీయాంశమయ్యింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని