Ayodhya Temple : అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు.. అతిథిగా ప్రధాని నరేంద్రమోదీ!

అయోధ్య రామమందిరం (Ayodhya Temple)  ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ప్రధాని నరేంద్ర మోదీని (Narendra modi) ఈ వేడుకకు ఆహ్వానించనున్నారు.

Published : 04 Aug 2023 20:21 IST

లఖ్‌నవూ: అయోధ్యలో నిర్మితమవుతున్న రామమందిరం (Ayodhya Temple)  ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభోత్సవం జరగనుందని రామమందిరం ట్రస్టు సభ్యులు వెల్లడించారు. ప్రధాని నరేంద్రమోదీని (Narendra modi) ఈ వేడుకకు ఆహ్వానించనున్నారు. ‘రామజన్మ భూమి ప్రారంభోత్సవం వచ్చే ఏడాది జనవరి మూడో వారంలో నిర్వహిస్తాం. జనవరి 21 నుంచి 23 వరకు కార్యక్రమాలు జరగనున్నాయి. ప్రధాని నరేంద్రమోదీని ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తాం. సాధువులు, ప్రముఖులను సైతం ఈ వేడుకకు ఆహ్వానిస్తామని’ రామమందిర ట్రస్టు కార్యదర్శి చంపత్‌ రాయ్‌ పేర్కొన్నారు. 

‘ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా పనిచేయలేను’.. కోర్టు హాలులోనే న్యాయమూర్తి రాజీనామా

ఆలయ ప్రారంభోత్సవంలోని ప్రధాన ఘట్టాన్ని రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తామన్నారు. వివిధ పార్టీల రాజకీయ నేతలను ఆహ్వానిస్తామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఎలాంటి వేదిక, బహిరంగ సభ ఉండబోదని స్పష్టం చేశారు. ఈ వేడుకకు 136 సనాతన సంప్రదాయాలకు చెందిన 25వేల మంది హిందూ మత పెద్దలను ఆహ్వానించాలని యోచిస్తున్నట్లు రాయ్‌ తెలిపారు. ఆ జాబితా సిద్ధమైన తరువాత ట్రస్టు అధ్యక్షుడు మహంత్‌ నిత్య గోపాల్‌దాస్‌ సంతకంతో వారికి ఆహ్వాన పత్రాలు పంపిస్తామన్నారు. వచ్చిన సాధువులకు మఠాల్లో ఆతిథ్యం ఇస్తామని చెప్పారు. 10వేల మంది సాధువులు ఆలయ పరిసరాల లోపల నిర్వహించే పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారని రాయ్‌ వివరించారు. 

2020 ఆగస్టు 5న రామమందిర నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. కొవిడ్‌ మహమ్మారి ప్రబలిన నేపథ్యంలో అప్పట్లో పరిమిత సంఖ్యలో మాత్రమే అతిథులు హాజరయ్యారు. ఆలయంలోని రామ్‌లల్లా గర్భగుడి నిర్మాణం శరవేగంగా పూర్తి కావొస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో ఘనంగా ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈ వేడుకను తిలకించేందుకు దేశవ్యాప్తంగా భక్తులు తరలివస్తారని ట్రస్టు భావిస్తోంది. అందుకే రోజుకు 75వేల నుంచి లక్ష మందికి భోజనాలు ఏర్పాటు చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని