Rat hole Miners: ‘మమ్మల్ని గట్టిగా కౌగిలించుకున్నారు.. ఇలాంటిది జీవితంలో ఒకేసారి వస్తుంది’

సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను బయటకు తీసుకురావడంపై ర్యాట్‌ హోల్‌ మైనర్లు జాతీయ మీడియాతో మాట్లాడారు. 

Updated : 29 Nov 2023 11:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉత్తరాఖండ్‌(Uttarakhand) ఉత్తర్‌కాశీలోని సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను ఎట్టకేలకు రెస్క్యూ సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. 17 రోజుల ఉత్కంఠకు తెరదీస్తూ వారంతా క్షేమంగా బయటకి రావడంతో దేశమంతా హర్షం వ్యక్తం చేసింది. కొన్ని మీటర్లు సొరంగాన్ని చేతులతో తవ్వి(Uttarkashi Tunnel Rescue) కార్మికులు బయటకు రావడంలో కీలకపాత్ర పోషించిన ర్యాట్‌ హోల్‌ మైనర్లు (Rat Hole Miners)ఒక్కరోజులోనే హీరోలయ్యారు. ప్రస్తుతం దేశమంతా వీరి గురించే చర్చిస్తోంది. శ్వాస తీసుకోవడానికి సైతం కష్టంగా ఉండే సొరంగంలో శిథిలాలను తవ్వుతూ ఎట్టకేలకు ఆపరేషన్‌ విజయవంతం(Uttarkashi Tunnel Operation)  చేసిన వీరి కృషి వెలకట్టలేనిది. 

మొత్తం 41 మంది కార్మికులను బయటకు తీసుకొచ్చిన తర్వాత ‘ర్యాట్‌ హోల్‌ మైనర్లు’ ఈ ఆపరేషన్‌ గురించి జాతీయ మీడియాతో పలు విషయాలు పంచుకున్నారు. ‘‘సొరంగాన్ని తవ్వుతుండగా చివరి అంకానికి చేరుకున్న క్రమంలో కార్మికులకు మేము కనిపించడంతో ఉద్వేగానికి లోనయ్యారు. చాలా ఆనంద పడ్డారు. బయటకొచ్చిన తర్వాత మమ్మల్ని హత్తుకొని వారి దగ్గరున్న బాదం పప్పును మాకు ఇవ్వజూపారు. మేము సుమారు 15 మీటర్లు తవ్వాం.  వారిని చేరుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని తమ అనుభవాలను పంచుకున్నారు. ‘‘మా కార్మికులు చాలా కష్టపడ్డారు. చిక్కుకున్న వారిని రక్షించాలని మేము గట్టిగా అనుకున్నాం. ఇలాంటి రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టడం జీవితంలో మాకు ఒకే సారి వస్తుంది. మా కార్మికులు 24 గంటల పాటు ఆపకుండా సొరంగాన్ని తవ్వి వారిని బయటకు తీసుకొచ్చారు’’ అని ర్యాట్‌ హోల్‌ మైనర్లకు నేతృత్వం వహించిన నిపుణుడు అన్నారు. 

నవంబర్‌ 12న పనులు చేస్తుండగా శిథిలాలు కూలడంతో 41 మంది కార్మికులు అందులో చిక్కుకుపోయారు. 17 రోజుల పాటు పలు రెస్క్యూ బృందాల కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు భిన్న మార్గాల్లో రాత్రింబవళ్లు కష్టపడ్డారు. సహాయక చర్యల్లో అడుగడుగునా అడ్డంకులు కల్గినప్పటికీ నిరూత్సాహక పడక ముందుకెళ్లారు. చివరికి అత్యంత రిస్క్‌, నిషేధిత ర్యాట్‌ హోల్‌ మైనింగ్‌ చేపట్టి ఆపరేషన్‌ను విజయవంతం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని