Southwest monsoon: ఒకే రోజున కేరళ, ఈశాన్య రాష్ట్రాలకు రుతుపవనాలు.. అరుదైన సందర్భానికి కారణమిదే..!

Southwest monsoon: నైరుతి రుతుపవనాల ఆగమనంతో కేరళలో వర్షాలు కురుస్తున్నాయి. అటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ వాతావరణం మేఘావృతమైంది.

Published : 30 May 2024 18:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మండు వేసవిలో చల్లని కబురును మోసుకొస్తూ నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) దేశంలోకి ప్రవేశించాయి. గురువారం ఉదయం కేరళ (Kerala) తీరాన్ని తాకినట్లు భారత వాతావరణ విభాగం అధికారికంగా వెల్లడించింది. అటు ఈశాన్య భారతం (Northeast India)లోనూ పలు ప్రాంతాలకు ఇవి విస్తరించాయని తెలిపింది. సాధారణంగా ఈ రెండుచోట్లా వేర్వేరు రోజుల్లో రుతుపవనాలు ప్రవేశించాల్సి ఉండగా.. ఈ ఏడాది అది ఒకే సమయంలో జరిగింది. మరి ఈ అరుదైన సందర్భానికి కారణమేంటో తెలుసా? రేమాల్‌ తుపానేనట (Cyclone Remal)..!

సాధారణంగా జూన్‌ 1వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత జూన్‌ 5 నాటికి అరుణాచల్‌ ప్రదేశ్‌, త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయ, మిజోరం, మణిపుర్‌, అస్సాం రాష్ట్రాలకు చేరుకుంటాయి. అయితే, ఈసారి రుతుపవనాల ఆగమనం సమయంలోనే  బంగాళాఖాతం (Bay of Bengal)లో రేమాల్‌ తుపాను ఏర్పడింది. ఇది రుతుపవనాల గమనాన్ని బలంగా లాగిందని, అందుకే నిర్ణీత సమయానికి ముందుగానే అవి ఈశాన్య రాష్ట్రాలకు చేరుకున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

చల్లని కబురు.. కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు

గతంలో 2017లోనూ ఇలాంటి అరుదైన సందర్భమే చోటుచేసుకుంది. అప్పుడు కూడా రుతుపవనాల ఆగమనానికి కొద్ది రోజుల ముందు బంగాళాఖాతంలో ‘మోరా తుపాను’ ఏర్పడింది. దీంతో ఒకే సమయంలో కేరళ, ఈశాన్య రాష్ట్రాలను ‘నైరుతి’ తాకింది.

రుతుపవనాల (Southwest Monsoon) ప్రభావంతో కేరళలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అటు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. రానున్న కొద్ది రోజుల్లో ఇవి తెలుగు రాష్ట్రాలకు విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈ ఏడాది లానినా అనుకూల పరిస్థితులు, భూమధ్యరేఖ వద్ద పసిఫిక్‌ మహాసముద్రం చల్లబడడం వంటి కారణాలతో సాధారణం కంటే ఎక్కువ వర్షం కురుస్తుందని ఐఎండీ అంచనా వేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని