Swati Maliwal: స్వాతీమాలీవాల్‌పై దాడి.. కేజ్రీవాల్‌ మౌనం సిగ్గుచేటు: నిర్మలా సీతారామన్‌

అరవింద్ కేజ్రీవాల్‌ ఇంట్లో ఆప్‌ ఎంపీ స్వాతీమాలీవాల్‌పై జరిగిన భౌతిక దాడి సిగ్గుచేటని కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ (Nirmala Sitharaman) అన్నారు. ఆ ఘటనను తీవ్రంగా ఖండించారు. 

Published : 17 May 2024 14:40 IST

దిల్లీ: ఆప్‌ ఎంపీ స్వాతీమాలీవాల్‌ (Swati Maliwal)పై దాడి ఘటన నేపథ్యంలో.. ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) మౌనం వహించడం దిగ్ర్భాంతికి గురిచేస్తోందని కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ (Nirmala Sitharaman) అన్నారు. మహిళా కమిషన్‌కు ఛైర్‌పర్సన్‌గా పనిచేసిన ఆమెకు ఈ పరిస్థితి ఎదురుకావడం సిగ్గుచేటన్నారు.

‘‘తన నివాసంలోనే పార్టీ ఎంపీపై దాడి జరిగితే.. కేజ్రీవాల్‌ (Swati Maliwal) ఒక్క మాట మాట్లాడకపోవడం షాక్‌కు గురిచేస్తోంది. తగిన చర్యలు తీసుకోలేదు. దీనిపై ఆయన క్షమాపణలు చెప్పాలి. యూపీ పర్యటనలో ఆయన వెంట నిందితుడు ఉన్నాడని నాకు తెలిసింది. ఆమెకు ఎదురైన పరిస్థితి సిగ్గుచేటు. ఫిర్యాదు చేయడానికి రోజుల సమయం పట్టిందంటే.. ఆమెపై ఒత్తిడి ఉందని అనిపిస్తోంది ’’ అని సీతారామన్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. మాలీవాల్‌పై కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ దాడికి పాల్పడిన ఘటనపై గురువారం పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. నిన్న దిల్లీ పోలీసు బృందం ఆమె ఇంటికి వెళ్లి వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంది. తనకు ఎదురైన భయానక పరిస్థితి గురించి ఆమె వెల్లడించిన విషయాలు సంచలనం సృష్టిస్తున్నాయి. అతడు తనపై విచక్షణారహితంగా భౌతిక దాడికి పాల్పడ్డాడని, సున్నితమైన శరీర భాగాలపై పలుమార్లు కొట్టాడని ఆమె వెల్లడించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆప్‌ ఎంపీకి శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమె ముఖంపై అంతర్గత గాయాలైనట్లు ఈ పరీక్షలో తేలిందని వైద్య వర్గాలు వెల్లడించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని