Remal Cyclone: రాళ్ల క్వారీలో 25 మంది సమాధి

రెమాల్‌ తుపాను ధాటికి ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మిజోరం రాజధాని ఆయిజోల్‌ నగర శివార్లలో మూడు దశాబ్దాలుగా వాడుకలో లేని ఒక రాళ్లక్వారీ మంగళవారం ఉదయం కుప్పకూలి, ఇద్దరు పిల్లలు సహా 14 మంది ప్రాణాలు కోల్పోయారు.

Published : 29 May 2024 03:19 IST

రెమాల్‌ తుపాను కారణంగా మిజోరంలో ఘోరం 
ఆయిజోల్‌తో తెగిపోయిన రహదారి సంబంధాలు 
కేరళలోనూ కుండపోత 

మిజోరం రాజధాని ఆయిజోల్‌ సమీపంలో భారీ వర్షాల కారణంగా కూలిన రాతి క్వారీ

ఆయిజోల్, తిరువనంతపురం: రెమాల్‌ తుపాను ధాటికి ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మిజోరం రాజధాని ఆయిజోల్‌ నగర శివార్లలో మూడు దశాబ్దాలుగా వాడుకలో లేని ఒక రాళ్లక్వారీ మంగళవారం ఉదయం కుప్పకూలి, ఇద్దరు పిల్లలు సహా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్వారీ సమీపంలోని ఇళ్లూ నేలమట్టమయ్యాయి. ఘటనాస్థలి నుంచి ఇద్దరిని కాపాడగలిగినా మరో ఎనిమిది మంది ఆచూకీ తెలియడం లేదు. మిజోరం రాజధానిలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు, మట్టిపెళ్లలు విరిగిపడిన ఘటనల్లోనూ పలువురు గల్లంతయ్యారు. రాళ్లక్వారీ ఘటనతో కలిపి మొత్తంగా కనీసం 25 మంది చనిపోయినట్లు ‘మిజోరం రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ’ (ఎంఎస్‌డీఎంయే) ప్రకటించింది. మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని భయపడుతున్నారు. ఆరో నంబరు జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడి ఆయిజోల్‌ సహా పలు ప్రాంతాలకు మిగతా దేశంతో కొన్నిగంటల పాటు రోడ్డు సంబంధాలు తెగిపోయాయి. ఎడతెగని వానలు పడుతుండడంతో సహాయక చర్యలకు విఘాతం కలుగుతోంది. ముఖ్యమంత్రి లాల్‌దుహోమా అత్యవసర సమీక్ష నిర్వహించి, మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అస్సాంలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి నలుగురు ప్రాణాలు కోల్పోగా 18 మంది గాయపడ్డారు. నాగాలాండ్‌లో నలుగురు మృతి చెందారు.

కేరళ.. అతలాకుతలం 

కేరళలో ఎడతెగని వానలు, పెనుగాలులతో సాధారణ జీవనానికి అంతరాయం కలిగింది. తిరువనంతపురం, కొల్లం, కొట్టాయం, ఎర్నాకుళం జిల్లాల్లో కుంభవృష్టి కురుస్తోంది. అనేకచోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయి. పలువురిని పునరావాస కేంద్రాలకు తరలించారు. కొట్టాయం, ఎర్నాకుళం జిల్లాలకు ‘భారత వాతావరణ విభాగం’ (ఐఎండీ) రెడ్‌ఎలర్ట్‌ ప్రకటించింది. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్‌ ఎలర్ట్‌ జారీచేసింది. కొచ్చిన్‌లో వేర్వేరు ప్రాంతాల్లో గంటలతరబడి కుండపోత వానలు కురుస్తున్నాయి. ఈ నగరంలో ప్రముఖ మలయాళీ రచయిత్రి ఎం.లీలావతి ఇంటిని వరదనీరు చుట్టుముట్టడంతో వందల పుస్తకాలు పూర్తిగా నీటమునిగి పాడయ్యాయి. ఆమె అందుకున్న అనేక జ్ఞాపికలు నీళ్లపై తేలియాడుతూ కనిపించాయి.కేరళలో కొన్ని పర్యాటక ప్రదేశాల్లోకి ఎవరినీ అనుమతించడంలేదు. ఇడుక్కి జిల్లాలో కొండప్రాంతాల్లో రాత్రిపూట రాకపోకలను నిషేధించారు. ప్రజలు అనవసర ప్రయాణాలు మానుకోవాలని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు