Jammu and Kashmir: కశ్మీర్‌లో పాకిస్థానీ అభ్యర్థులు పోటీచేసిన చోట్ల రీపోలింగ్‌..!

2020లో జమ్ము కశ్మీర్‌లో జరిగిన డీడీసీ ఎన్నికల్లో కొందరు పాకిస్థానీ జాతీయులు పోటీచేశారు. దీంతో అక్కడ ఎన్నికలను నిలిపివేసి నేడు రీపోలింగ్‌ నిర్వహిస్తున్నారు. 

Updated : 05 Dec 2022 15:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జమ్ముకశ్మీర్‌(Jammu and Kashmir)లో గతంలో పాకిస్థానీ అభ్యర్థులు పోటీ చేసిన రెండు డిస్ట్రిక్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (DDC) స్థానాలకు తాజాగా రీపోలింగ్‌ జరుగుతోంది. కుప్వారా జిల్లాలోని దృగ్‌ముల్లా, బందిపోరా జిల్లాలో హజాన్‌ డీడీసీ స్థానాలను మహిళలకు రిజర్వు చేశారు. 2020లో ఇక్కడ జరిగిన ఎన్నికల్లో సోమియా సదాఫ్‌, షాజియా బేగం అనే ఇద్దరు పాకిస్థానీ జాతీయులు ఇక్కడి నుంచి పోటీచేశారు. కానీ, ఆ ఎన్నికల ఫలితాలను ప్రకటించడానికి కొద్ది సేపటి ముందు వారి జాతీయతపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో వారు ఎన్నికల ఫలితాలను నిలిపివేశారు.

ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ జాతీయతపై దర్యాప్తు చేపట్టింది. ఇద్దరు మహిళలు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(PoK)కు చెందిన వారుగా తేలడంతో ఆ ఎన్నికను రద్దు చేస్తున్నట్లు ఎన్నికల కమిషన్‌ పేర్కొంది. ఆ ఇద్దరు మాజీ ఉగ్రవాదులను పెళ్లి చేసుకొని 2010లో మిలిటెంట్ల లొంగుబాటు పథకాన్ని వాడుకొని.. అక్రమంగా కశ్మీర్‌లో ప్రవేశించినట్లు గుర్తించారు.  

కశ్మీర్‌లో దాదాపు 350 కశ్మీరీ పురుషులు మిలిటెంట్‌ శిక్షణ కోసం 1990ల్లో నియంత్రణ రేఖ ( the Line of Control) దాటి పీవోకేలోకి ప్రవేశించారు. అక్కడ వారు మహిళలను పెళ్లి చేసుకున్నారు. కొందరు మిలిటెంట్లుగా మారలేదు. ఆ తర్వాత లొంగిపోయిన మిలిటెంట్లకు ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుండటంతో నేపాల్‌ మార్గంలో వారు తిరిగి కశ్మీర్‌లోకి ప్రవేశించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నియంత్రణ రేఖ వైపు నుంచి కాకుండా నేపాల్‌ (Nepal) మార్గంలో రావడాన్ని అక్రమంగా పరిగణిస్తారు. తాజాగా ఎన్నికల్లో సోమియా సదాఫ్‌, షాజియా బేగం పేర్లను తొలగించగా.. 15 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

దాదాపు రెండేళ్లు గడిచిపోవడంతో ఇక్కడ విచిత్ర పరిస్థితి నెలకొంది. మెహబూబా ముఫ్తీకి చెందిన పీడీపీ అభ్యర్థి పార్టీకి గుడ్‌బై చెప్పి.. సజ్జాద్‌ లోన్‌కు చెందిన పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌లో చేరారు. కానీ, అతడు పీడీపీ గుర్తుపైనే బరిలో ఉన్నాడు. అతడి గుర్తును మార్చేందుకు ఎన్నికల కమిషన్‌ అంగీకరించలేదు. దీంతో అతడికి ఓటు వేయవద్దని పీడీపీ ప్రచారం చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు