Republic day: కేంద్రం కీలక నిర్ణయం.. రిపబ్లిక్‌ పరేడ్‌లో క్వైట్‌ ఏ ఛేంజ్‌!

వచ్చే ఏడాది రిపబ్లిక్‌ డే (Republic day) వేడుకల పరేడ్‌ కేవలం మహిళలకు మాత్రమే అవకాశం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Updated : 23 Jan 2024 15:29 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గణతంత్ర దినోత్సవ వేడుకల (Republic Day) పరేడ్‌లో ఈసారి అందరూ మహిళలే కనిపించనున్నారు. ఈ మేరకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. దీనికి సంబంధించి ఇప్పటికే  కేంద్ర హోం మంత్రిత్వశాఖ, సాంస్కృతిక, పట్టణాభివృద్ధి శాఖలకు అంతర్గత సమాచారం అందినట్లు తెలుస్తోంది. సైనిక, ఇతర రంగాల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని, సాధికారతను ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నిర్ణయం అమలుపై వివిధ శాఖల అధిపతులతో కసరత్తు జరుగుతున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు.

గత మార్చిలోనే గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొననున్న వివిధ రక్షణ సంస్థలు, ఆర్మీ, పోలీస్‌, పారామిలటరీలకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ‘‘ 2024 జనవరి 26న నిర్వహించే గణతంత్రదినోత్సవ వేడుకల్లో ఈ సారి కేవలం మహిళలకే అవకాశం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. పరేడ్‌కు నేతృత్వం వహించిన దగ్గరి నుంచి బ్యాండ్‌ పార్టీ, శకటాల ప్రదర్శనల వరకు అందరూ మహిళలే ఉంటారు.’’ అని కేంద్ర ప్రభుత్వ సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. మరోవైపు కేంద్రం నుంచి ఈ విషయంపై తమకు కూడా అధికారిక లేఖ అందిందని, అయితే, దీనిని ఎలా అమలు చేయాలన్నదానిపై కసరత్తు చేస్తున్నామని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.

రిపబ్లిక్‌ డే వేడుకలు భారత సైనిక శక్తికి, సంస్కృతి సంప్రదాయాలకు, విజయాలకు అద్దం పడతాయి. ఈ కార్యక్రమానికి వేలాది మంది ప్రముఖులు హాజరై ప్రత్యక్షంగా తిలకిస్తారు. కోట్లాది మంది టీవీల్లో చూస్తారు. విదేశాలకు చెందిన ఓ ప్రముఖ వ్యక్తిని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తారు. అందువల్ల కేంద్రం ఈ వేడుకలను చాలా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తుంది. ఈ క్రమంలోనే మహిళా శక్తిని ప్రపంచానికి తెలియజేసేలా, వారిని మరింత ప్రోత్సహించేలా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇటీవల కాలంలో ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌తోపాటు పారామిలటరీ యూనిట్స్‌లోనూ మహిళలకు ప్రాధాన్యత పెరిగింది. ఈ క్రమంలో వారినే రిపబ్లిక్‌డే వేడుకలకు కమాండర్లుగా, డిప్యూటీ కమాండర్లుగా ఎంపిక చేసే అవకాశముంది. 2015లో తొలిసారిగా త్రివిధ దళాల నుంచి వేర్వేరుగా మహిళల బృందం రిపబ్లిక్‌ డే పరేడ్‌లో పాల్గొంది.  2019లో కెప్టెన్‌ షిఖా సురభి బైక్‌పై విన్యాసాలు చేసిన తొలి మహిళా అధికారిణిగా రికార్డుకెక్కారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని