Republic Day: దిల్లీలో ఘనంగా గణతంత్ర సంబరాలు

దేశ రాజధాని దిల్లీలో 73వ గణతంత్ర వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. దేశ ప్రథమపౌరుడు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధానమంత్రి

Updated : 23 Jan 2024 14:57 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో 73వ గణతంత్ర వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. దేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధానమంత్రి నరేంద్రమోదీ వందనం చేసి ఈ వేడుకలను ప్రారంభించారు. అనంతరం విశిష్ట సేవలందించిన వారికి రాష్ట్రపతి పురస్కారాలు ప్రదానం చేశారు. 2020 ఆగస్టులో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిన జమ్మూకశ్మీర్‌ పోలీసు ఏఎస్‌ఐ బాబురామ్‌కు అశోక్‌ చక్ర పురస్కారం వరించింది. ఈ అవార్డును మరణానంతరం ప్రకటించగా.. బాబురామ్‌ కుటుంబసభ్యులు నేడు రాష్ట్రపతి చేతులమీదుగా పురస్కారాన్ని స్వీకరించారు. 

ఈ కార్యక్రమం తర్వాత రాజ్‌పథ్‌లో గణతంత్ర పరేడ్‌ ప్రారంభమైంది. దేశ సైనిక సామర్థ్యాన్ని చాటి చెప్పేలా పరేడ్‌ను ఘనంగా నిర్వహించారు. వాయుసేన విన్యాసాలు, శకటాల ప్రదర్శనతో ఆద్యంతం పరేడ్‌ ఆకట్టుకుంటోంది.

ఈసారి ప్రత్యేకతలివే..

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఈ ఏడాదికి 75ఏళ్లు పూర్తికానుంది. ఈ సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే 73వ గణతంత్ర వేడుకల్లో పలు ప్రత్యేకతలు చోటుచేసుకుంటున్నాయి. 

* రిపబ్లిక్‌ డే కవాతులో మొదటిసారిగా భారత వాయుసేనకు చెందిన 75 విమానాల విన్యాసాలు జరగనున్నాయి. ఇందులో పాత విమానాలతో పాటు ఆధునిక ఫైటర్‌ జెట్‌లు అయిన రఫేల్‌, సుఖోయ్‌, జాగ్వార్‌ వంటివి ప్రదర్శించనున్నారు.

* దేశవ్యాప్త పోటీల నుంచి ఎంపిక చేసిన 480 బృందాలతో సాంస్కృతిక ప్రదర్శనలు జరగనున్నాయి.

* రక్షణ, సాంస్కృతిక మంత్రిత్వశాఖల ఆధ్వర్యంలో 600 మంది ప్రముఖ చిత్రకారులు రూపొందించిన చిత్రాల ప్రదర్శన ఉంటుంది.

* రాజ్‌పథ్‌ మార్గంలో అటూ ఇటూ అయిదేసి చొప్పు పది భారీ ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. గణతంత్ర వేడుకల విశేషాలు, సాయుధ దళాలపై చిత్రీకరించిన లఘు చిత్రాలు కవాత ప్రారంభానికి ముందు ఎల్‌ఈడీ తెరలపై ప్రదర్శించారు.

* సాధారణంగా ప్రతి ఏటా ఉదయం 10 గంటలకు పరేడ్‌ను ప్రారంభిస్తారు. అయితే ఈసారి దిల్లీలో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అరగంట ఆలస్యంగా  ప్రారంభమైంది.

అమరవీరులకు మోదీ నివాళులు..

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అమరవీరులకు నివాళులర్పించారు. ఇండియాగేట్‌ సమీపంలోని జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించిన మోదీ.. అక్కడ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు వందనం చేశారు. స్మారకం వద్ద ఉన్న సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు. అక్కడి నుంచి రాజ్‌పథ్ చేరుకుని గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ దంపతులు, కేంద్రమంత్రులు అమిత్ షా, నితిన్‌ గడ్కరీ, నిర్మలా సీతారామన్‌, పలువురు ప్రముఖులు ఈ వేడుకలకు హాజరయ్యారు.

ఫొటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు