RepublicDay 2023: రిపబ్లిక్‌ డే పరేడ్‌కు వెళ్తారా? మీ ఫోన్‌లోనే పాస్‌లు పొందండి ఇలా..!

రిపబ్లిక్‌ డే వేడుకలకు సైనికులు రిహార్సల్స్‌ మొదలు పెట్టారు. ఔరా అన్పించే ఈ విన్యాసాలను చూసేందుకు కేంద్రం ఆన్‌లైన్‌లో టిక్కెట్లు అందుబాటులో ఉంచింది. జనవరి 26న జరిగే ఈ గ్రాండ్‌ పరేడ్‌ను వీక్షించాలనుకొనే వారు టిక్కెట్లను ఇలా పొందొచ్చు.

Updated : 23 Jan 2024 16:47 IST

దిల్లీ: భారత 74వ గణతంత్ర వేడుకలకు(Republic Day celebrations) ఏర్పాట్లు షురూ అయ్యాయి. జనవరి 26న జరిగే ఈ రిపబ్లిక్‌ డే వేడుకల్లో దేశ సైనిక శక్తిని, భారతీయ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా మన సైనిక బలగాలు, దిల్లీ పోలీసులు కర్తవ్యపథ్‌లో నిర్వహించే పరేడ్‌కు ఇప్పటికే రిహార్సల్స్‌ మొదలుపెట్టారు. శకటాల ప్రదర్శనలు, యుద్ధ విమానాల విన్యాసాలు, ఔరా.. అన్పించే సైనిక విన్యాసాలు.. ఇలా ఆద్యంతం ఆకట్టుకొనే ఆ సన్నివేశాల్ని వీక్షించేందుకు రెండు కళ్లూ చాలవు. ఇలాంటి అపురూపమైన గ్రాండ్‌ పరేడ్‌ను వీక్షించేందుకు కేంద్రం ఈసారి ఆన్‌లైన్‌లో పాసులు జారీ చేస్తోంది. గతంలో దిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో టిక్కెట్లు ఇచ్చేవారు. కానీ ఈసారి ప్రపంచంలో ఎక్కడ ఉన్నవారైనా దిల్లీకి వచ్చి వీక్షించేలా ఈసారి టిక్కెట్లను ఆన్‌లైన్‌లో ఉంచింది. ఇందుకోసం ప్రత్యేక పోర్టల్‌ను సైతం ప్రారంభించింది. ఈ అద్భుతమైన పరేడ్‌ను వీక్షించాలనుకొనే వారు www.aamantran.mod.gov.inను సందర్శించి టిక్కెట్లు/పాస్‌లు పొందొచ్చు. ఈ టిక్కెట్లను జనవరి 6 నుంచి 24వరకు జారీ చేయనున్నారు. 

గతంలో ఈ పాసులను కేవలం దిల్లీలోనే కౌంటర్లలో విక్రయించడంతో దేశంలోని మిగతా ప్రాంతాలకు చెందిన ప్రజలు ముందుగా వెళ్లి పాసులు తీసుకొని ఈ వేడుకల్లో పాల్గొనడం దాదాపు అసాధ్యంగా ఉండేది. కానీ ఈసారి ఈసారి ప్రత్యేక కౌంటర్లతో పాటు ఆన్‌లైన్‌లోనూ పాస్‌లు జారీ చేస్తుండటంతో ఆసక్తి ఉన్న ఎవరైనా ఆన్‌లైన్‌లో పాసులు తీసుకొని ఆరోజు పరేడ్‌కు వెళ్లి వీక్షించే వెసులుబాటు కలగనుంది. ప్రముఖులు, అతిథులకు కూడా ఇదే పోర్టల్‌ నుంచి పాస్‌లు జారీ చేస్తున్నారు. ఈ పోర్టల్‌కు తోడు కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ దిల్లీలోని దిల్లీలోని సేన భవన్‌ (గేటు- 2); శాస్త్రి భవన్‌ (గేటు- 3), జంతర్‌మంతర్‌ (మెయిన్‌ గేటు వద్ద), ప్రగతి మైదాన్‌ (గేటు- 1), పార్లమెంట్‌ హౌస్‌ (రిసెప్షన్‌ కార్యాలయం) వద్ద ఈ-టిక్కెట్లు విక్రయిస్తున్నారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు, అలాగే, మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు టికెట్లు పొందొచ్చని అధికారులు తెలిపారు. 

ఎలా పొందాలి?

  • www.aamantran.mod.gov.inను సందర్శించి తొలుత మీ మొబైల్‌ నంబర్‌, క్యాప్చా కోడ్‌ ఎంటర్‌ చేయాలి.
  • పరేడ్‌కు హాజరయ్యే వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి.
  • అన్ని వివరాలూ సమర్పించాక ఓటీపి ఎంటర్‌ చేయాలి.
  • మీ ఛాయిస్‌ ప్రకారం టిక్కెట్‌ను ఎంచుకోవచ్చు.
  • చివరగా ఆన్‌లైన్‌ పేమెంట్‌ చేసి టిక్కెట్‌ను పొందొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని