PM Modi: భవిష్యత్తు తరాల లబ్ధి కోసమే భాజపా పథకాలు: ప్రధాని మోదీ

ఒక కుటుంబం, ఒక తరం కోసం సంక్షేమ పథకాలు రూపొందించలేదని.. భవిష్యత్తు తరాలకు సైతం లబ్ధి చేకూరేలా పథకాల రూపకల్పన జరిగిందని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. అలానే, దేశంలోని వనరులపై అందరికంటే పేదలకు, అణగారిన వర్గాలకు ఎక్కువ హక్కు ఉందని చెప్పారు.

Published : 07 Jul 2023 22:57 IST

వారణాసి: పేదలకు గౌరవం కల్పించేందుకు భరోసా ఇస్తున్నట్లు ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. వారణాసి పర్యటనలో భాగంగా రూ.12 వేల కోట్ల విలువైన అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా పీఎం స్వనిధి యోజన (PM SVANidhi Yojana)కింద లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. దేశంలోని వనరులపై అందరికంటే పేదలకు, అణగారిన వర్గాలకు ఎక్కువ హక్కు ఉందని ప్రధాని మోదీ చెప్పారు. గతంలో బ్యాంకులు కేవలం ధనిక వర్గాల వారికి మాత్రమే అందుబాటులో ఉండేవని, ఇప్పుడు పేదవారు సైతం బ్యాంకుల నుంచి ఎలాంటి గ్యారెంటీ లేకుండా రుణాలు పొందుతున్నారని తెలిపారు.

‘‘గత తొమ్మిదేళ్లలో భాజపా ప్రభుత్వం ఎంతో మార్పు తీసుకొచ్చింది. 50 కోట్ల జన్‌ధన్‌ ఖాతాలు తెరిపించాం. పేదవారికి గౌరవానికి నాది భరోసా. పేదవారి సంక్షేమానికైనా, మౌలికవసతుల సదుపాయానికైనా బడ్జెట్‌ కొరత లేదు. 50 ఏళ్లలో రాజధాని ఎక్స్‌ప్రెస్ కేవలం 16 మార్గాల్లో, 35 ఏళ్లలో శతాబ్ది ఎక్స్‌ప్రెస్ 19 మార్గాల్లో మాత్రమే ప్రయాణిస్తున్నాయి. కానీ, నాలుగేళ్లలో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్ రైళ్లు 25 మార్గాల్లో ప్రయాణిస్తున్నాయి. భగవంతుడి ఆశీస్సులతో కాశీ అభివృద్ధి నిరాటంకంగా సాగుతుంది’’ అని ప్రధాని మోదీ తెలిపారు. 

ఇవీ చదవండి: PM Modi: వర్షం పడుతున్నా లెక్కచేయక.. మోదీకి అపూర్వ స్వాగతం

గత ప్రభుత్వాలు ఏసీ రూమ్‌లలో కూర్చుని సంక్షేమ పథకాలు రూపొందించాయని ప్రధాని మోదీ విమర్శించారు. కానీ, భాజపా ప్రభుత్వం లబ్ధిదారుల వద్దకు వెళ్లి వాళ్ల నుంచి సమాచారం సేకరించి.. దాని ఆధారంగా పథకాల రూపకల్పన చేస్తోందని చెప్పారు. కేవలం ఒక కుటుంబం, ఒక తరం కోసం వీటిని రూపొందించలేదని.. భవిష్యత్తు తరాలకు సైతం లబ్ధి చేకూరేలా పథకాల రూపకల్పన జరిగిందని ప్రధాని మోదీ చెప్పారు. మరోవైపు ప్రధాని మోదీ వారణాసి సభలో పాల్గొనేందుకు వచ్చే సమయంలో ప్రజలు, భాజపా కార్యకర్తలు ఆయనకు గోరఖ్‌పుర్‌లో ఘన స్వాగతం పలికారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రహదారికి ఇరువైపులా నిలబడి ప్రధానికి స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని