Trinamool Congress: గవర్నర్‌ చర్యలను అడ్డుకోండి.. ఈసీకి తృణమూల్‌ ఫిర్యాదు

ఎన్నికల ప్రక్రియలో గవర్నర్‌ సీవీ ఆనంద్‌బోస్ జోక్యం చేసుకుంటున్నారని, దీనికి అడ్డుకట్ట వేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి తృణమూల్‌ కాంగ్రెస్‌ ఫిర్యాదు చేసింది.

Published : 22 Mar 2024 23:05 IST

కోల్‌కతా: రాష్ట్రంలో ప్రారంభమైన సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ సీవీ ఆనంద్‌ బోస్‌ చట్ట విరుద్ధంగా జోక్యం చేసుకుంటున్నారంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఆయన చర్యలను అడ్డుకోవాలని కోరింది. ఎన్నికల సంఘానికి సమాంతరంగా కార్యాలయాన్ని నడిపేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. ‘‘లోగ్‌సభ’’ పేరుతో ఫిర్యాదులు స్వీకరించడం, ఎన్నికలను పర్యవేక్షించేందుకు సమాంతర వ్యవస్థను అమలు చేయకుండా గవర్నర్‌ను నిరోధించాలని కోరింది. 

ఎన్నికల సంఘం మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ ( ఎన్నికల నియమావళి)ని అమల్లోకి తెచ్చిన వెంటనే.. గవర్నర్‌ ‘లోగ్‌ సభ’ను ప్రారంభించారని విమర్శించింది. గవర్నర్‌ చర్యలు రాజ్యాంగ స్ఫూర్తివి విఘాతం కలిగిస్తున్నాయని పేర్కొంటూ..  ఆయన సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేయడం ఎన్నికల సంఘం అధికారాలను బలహీన పరచడమేనని లేఖలో తెలిపింది. ఇలాంటి చర్యలతో ప్రజలు గందరగోళానికి గురవుతారని, దీనికి వెంటనే పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని రాసుకొచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని