Delhi: ఇది రాహుల్‌ ప్రతీకార చర్య: జైవీర్‌ షెర్గిల్‌

కాంగ్రెస్‌, ఆమ్‌ఆద్మీ మధ్య జరిగిన సీట్ల సర్దుబాటు ఒప్పందంలో అహ్మద్‌ పటేల్‌ కుటుంబాన్ని కాదని భరూచ్‌ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ ఆప్‌కు కట్టబెట్టడాన్ని పలువురు వ్యతిరేకించారు.

Published : 25 Feb 2024 15:33 IST

దిల్లీ: గాంధీల కుటుంబం యూజ్‌ అండ్‌ త్రో విధానాన్ని పాటిస్తారని భాజపా నేత అమిత్‌ మాల్వియా(Amit Malviya) విమర్శించారు. అందుకే సీట్ల పంపకాల విషయంలో అహ్మద్‌ పటేల్‌కు కంచుకోటగా ఉన్న భరూచ్‌(Bharuch) సీటును ఆప్‌కు కట్టబెట్టారని దుయ్యట్టారు. ఇది అహ్మద్ పటేల్ వారసత్వాన్ని తుడిచిపెట్టి, ఆయన కుటుంబాన్ని అవమానపరచడానికి రాహుల్ గాంధీ చేసిన ప్రయత్నమని విమర్శలు గుప్పించారు. అహ్మద్ పటేల్ కుమార్తె ముంతాజ్ పటేల్(Mumtaz Patel) ఎక్స్‌లో పెట్టిన పోస్టును  మాల్వియా ట్యాగ్‌ చేశారు. అందులో భరూచ్ జిల్లా పార్టీ క్యాడర్‌ను ఉద్దేశించి తన తండ్రికి అండగా నిలిచిన నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పోటీచేయనందుకు క్షమాపణలు చెప్పారు. కలిసికట్టుగా కాంగ్రెస్‌ను బలోపేతం చేస్తాం. అహ్మద్ పటేల్ 45 ఏళ్ల వారసత్వాన్ని వృథా పోనివ్వం అని రాసుకొచ్చారు. 

దివంగత అహ్మద్ పటేల్, రాహుల్ గాంధీ మధ్య విభేదాలు అందరికీ తెలిసిందే. గుజరాత్‌లోని భరూచ్‌ నియోజకవర్గాన్ని ఆప్‌కు అప్పగించి పటేల్‌ పట్ల యువరాజు ప్రతీకారం తీర్చుకున్నారని భాజపా అధికార ప్రతినిధి జైవీర్‌ షెర్గిల్‌ (Jaiveer Shergill) మండిపడ్డారు. 

కాంగ్రెస్ ప్రధాన ట్రబుల్ షూటర్‌గా పేరు పొందిన అహ్మద్ పటేల్ కాంగ్రెస్‌లో కీలక బాధ్యతలు నిర్వహించారు. 1976లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన పటేల్‌ 2020లో ఆయన మరణించే వరకు కాంగ్రెస్‌ కోసం పాటుపడ్డారు. పార్టీ సంక్షోభ సమయాల్లో ఉన్నప్పుడు సమస్యలను పరిష్కరించేవారు.

శనివారం, కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ సీట్ల పంపకానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. భరూచ్‌ నియోజకర్గంలో అహ్మద్‌ పటేల్‌ వారసులకు అవకాశం వస్తుందనే ఊహాగానాలను చెరిపేస్తూ కాంగ్రెస్‌ ఆ సీట్‌ను ఆప్‌కు కేటాయించింది. యూపీలో అఖిలేష్ యాదవ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీతో ఒప్పందం కుదుర్చుకుంది. అక్కడ కాంగ్రెస్‌  17 స్థానాల్లో పోటీ చేయనుంది.

కాని మహారాష్ట్ర , బెంగాల్‌లో పంపకాల విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది.  ఉద్ధవ్ థాక్రే శివసేన(UBT) ఎనిమిది స్థానాలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్రంలోని మొత్తం 42 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది.

భాజపాను ఎదుర్కోవడానికి గత ఏడాది  ఏర్పాటైన ఇండియా బ్లాక్ ఎన్నికలకు ముందు ఇద్దరు కీలక భాగస్వాములను కోల్పోయింది. నితీష్ కుమార్‌ జేడీ(యు), జయంత్ చౌదరి రాష్ట్ర లోక్ దళ్ రెండు పార్టీలు భాజపాతో పొత్తు పెట్టుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు