Chhindwara: ‘కమలనాథు’డి కంచుకోటను పెకిలించిన కమలం!

కాంగ్రెస్‌ కంచుకోటగా ఉన్న ఛింద్వాడా స్థానంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమలనాథ్‌ కుమారుడైన సిటింగ్‌ ఎంపీ నకుల్‌నాథ్‌ ఓటమిని చవిచూశారు.

Published : 05 Jun 2024 21:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సార్వత్రిక ఎన్నికల్లో అనేక రాష్ట్రాల్లో పుంజుకున్న కాంగ్రెస్‌.. గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లలో మాత్రం మరింత వెనకబడిపోయింది. ముఖ్యంగా మధ్యప్రదేశ్‌లో భాజపా మొత్తం 29 స్థానాల్లో క్లీన్‌స్వీప్‌ చేయడంతో సహా కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఛింద్వాడాలోనూ జయకేతనం ఎగరవేసింది. ఇందుకు ప్రధానమంత్రి మోదీకి ఉన్న ప్రజాదరణ, భాజపా అగ్రనేతల విస్తృత ప్రచారం దోహదపడినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వీటితోపాటు అమిత్‌ షా వ్యూహాలు, సీఎం మోహన్‌ యాదవ్‌ పర్యటనలు పనిచేసినట్లు పేర్కొంటున్నారు.

మధ్యప్రదేశ్‌లో పాలకపక్షమైన భాజపా మొత్తం 29 స్థానాలనూ క్లీన్‌స్వీప్‌ చేసింది. కాంగ్రెస్‌ కంచుకోటగా ఉన్న ఛింద్వాడా స్థానంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమలనాథ్‌ కుమారుడైన సిటింగ్‌ ఎంపీ నకుల్‌నాథ్‌ ఓటమిని చవిచూశారు. తొమ్మిదిసార్లు అక్కడ నుంచి ఎంపీగా ఉన్న కమల్‌నాథ్‌.. క్రితం ఎన్నికల్లోనే తన కుమారుడిని బరిలో దింపారు. ఈసారి కూడా అక్కడ నుంచే పోటీలో దింపినప్పటికీ కమలం హవా దాటికి కంచుకోట చేజారిపోయింది. స్వాతంత్ర్యం సాధించిన తర్వాత ఛింద్వాడాలో భాజపా గెలవడం ఇది రెండోసారి మాత్రమే. మరోవైపు రాజ్‌గఢ్‌ నుంచి దిగ్విజయ్‌సింగ్‌ ఓడిపోయారు.

భాజపా జాతీయస్థాయి నేతలతోపాటు మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ కూడా రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేశారు. 180కిపైగా బహిరంగ సభలు, 58 రోడ్‌షోలు నిర్వహించారు. అటు కాంగ్రెస్‌ మాత్రం ప్రచారంలో వెనకబడిపోయింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీలు ఒక్కొక్క బహిరంగ సభలో పాల్గొనగా.. రాహుల్‌ మాత్రం ఐదు సభల్లో పాల్గొన్నారు.

ప్రచారంతోపాటు కాంగ్రెస్‌ నుంచి దాదాపు లక్ష మంది కార్యకర్తలను తమ పార్టీలో చేర్చుకోవాలని భాజపా లక్ష్యంగా పెట్టుకుంది. ఛింద్వాడా నుంచే 50వేల మందిని చేర్చుకోవాలని టార్గెట్‌ చేసుకుంది. ఈ క్రమంలో కమల్‌ నాథ్ సన్నిహితులు కూడా కాషాయ కండువా కప్పుకొన్నారు. మరోవైపు ఎన్నికల ముందు కమల్‌నాథ్‌, ఆయన కుమారుడు నకుల్‌నాథ్‌లు దిల్లీలో మకాం వేయడం చర్చనీయాంశమయ్యింది. వీరిద్దరు భాజపాలో చేరుతున్నారనే ప్రచారం జరగడంతో వాటిని కమల్‌నాథ్‌ తోసిపుచ్చారు. అయినప్పటికీ ఆ పరిణామాలు కాంగ్రెస్‌ శ్రేణుల్లో నిరుత్సాహం కలిగించాయనే వాదన ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని