Rishi Sunak: అక్షర్‌ధామ్‌లో రిషి సునాక్‌ ప్రత్యేక పూజలు

Rishi Sunak: బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ దిల్లీలోని అక్షర్‌ధామ్‌ను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Published : 10 Sep 2023 10:08 IST

దిల్లీ: జీ20 శిఖరాగ్ర సదస్సు కోసం దిల్లీకి వచ్చిన బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌ (Rishi Sunak) ఆదివారం ఉదయం అక్షర్‌ధామ్‌ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట సతీమణి అక్షతా మూర్తి కూడా ఉన్నారు. ఆయన రాక నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో దిల్లీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

ఆలయాన్ని సందర్శించనున్నట్లు సునాక్‌ శనివారం సాయంత్రమే మీడియాకు వెల్లడించారు. హిందువుగా తాను గర్విస్తున్నానన్నారు. ఆ సంస్కృతిలోనే తాను పెరిగానని తెలిపారు. తన విశ్వాసాలే ఒత్తిడి సమయంలో తనకు సాంత్వననిస్తాయని వివరించారు. ఇటీవలే రక్షాబంధన్‌ నిర్వహించుకున్నట్లు వెల్లడించారు. తన చెల్లితో పాటు సమీప బంధువులు తనకు రాఖీలు కట్టినట్లు చెప్పారు. జన్మాష్టమి జరపుకొనేందుకు తనకు సమయం లభించలేదన్నారు.

ఆలయ దర్శనం తర్వాత సునాక్‌ మహాత్మా గాంధీ స్మారకం రాజ్‌ఘాట్‌ (Rajghat)కు చేరుకున్నారు. అక్కడ ఆయనకు ప్రధాని మోదీ స్వాగతం పలికారు. జీ20 సదస్సు నిమిత్తం భారత్‌కు చేరుకున్న దేశాధినేతలందరితో కలిసి సునాక్‌ గాంధీ మహాత్ముడికి నివాళులర్పించనున్నారు. మరోవైపు సునాక్‌తో మోదీ శనివారం ద్వైపాక్షిక చర్చలు జరిపిన విషయం తెలిసిందే. చరిత్రాత్మకంగా నిలిచిపోయే రీతిలో సాధ్యమైనంత త్వరగా ‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం’ (ఎఫ్‌టీఏ) కుదుర్చుకునేందుకు కలిసి అడుగులు వేయాలని ఇరు దేశాధినేతలు నిర్ణయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు