రూమ్‌ నెం. 39.. ఉత్తర కొరియా ఖజానా!

ఉత్తర కొరియా పేరు చూడగానే ఆ దేశ అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌.. ఆయన విలాసవంతమైన జీవనశైలి గుర్తొస్తుంది. కిమ్‌ తను తినే ఆహార పదార్థాలను విదేశాల నుంచి తెప్పించుకుంటాడు. ఖరీదైన కార్లు, వాచీలంటే ఆయనకు చాలా ఇష్టం. అందుకే తరుచూ కొనుగోలు చేస్తుంటాడు. తను ఉండటానికి దేశవ్యాప్తంగా

Updated : 07 Jul 2021 14:28 IST

ఉత్తర కొరియా పేరు వినగానే ఆ దేశ అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌.. ఆయన నియంతృత్వ పాలన, విలాసవంతమైన జీవనశైలి గుర్తొస్తుంది. కిమ్‌ తను తినే ఆహార పదార్థాలను విదేశాల నుంచి తెప్పించుకుంటాడు. ఖరీదైన కార్లు, వాచీలంటే ఆయనకు చాలా ఇష్టం. అందుకే తరచూ కొనుగోలు చేస్తుంటాడు. తను ఉండటానికి దేశవ్యాప్తంగా 17 ప్యాలెస్‌లు, తన ఆరోగ్య పరిరక్షణ కోసం 130 మంది వైద్యులతో ఓ ఆస్పత్రి ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఆయన పెంచుకునే జంతువుల పోషణకే దేశ బడ్జెట్‌లో 20శాతం నిధులు కేటాయిస్తున్నారంటే ఆయన చేసే ఖర్చు ఏ విధంగా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఒకవైపు ప్రజలంతా ఆకలికి అలమటిస్తుంటే.. మరోవైపు కేవలం కిమ్‌ రాజ వైభోగాల కోసం దేశ ప్రభుత్వం అనేక విధాలుగా ఆదాయం సమకూరుస్తోంది. అయితే, అందులో సింహాభాగం రూమ్‌ నంబర్‌ 39 నుంచే వస్తుంది. ఇంతకీ ఈ రూమ్‌ నంబర్‌ 39 ఏంటి?? రూమ్‌ నుంచి ఆదాయం రావడమేంటని అనుకుంటున్నారా?అయితే, ఈ కథనం చదివేయండి..

ఒకప్పుడు ఆర్థిక వ్యవస్థకు కేంద్రం..

సెంట్రల్‌ కమిటీ బ్యూరో 39 ఆఫ్ ది వర్కర్స్‌ పార్టీ ఆఫ్ కొరియా.. దీన్నే రూమ్‌ నంబర్‌ 39.. బ్యూరో 39.. డివిజన్‌ 39.. ఆఫీస్‌ 39 అని కూడా పిలుస్తుంటారు. దీన్ని 1970లో ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్‌ ఇల్‌ సుంగ్‌ ఆ దేశ రాజధాని ప్యాంగ్యాంగ్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేశారు. ఈ రూమ్‌ నంబర్‌ 39ను దేశ ఆర్థిక వ్యవస్థకు కేంద్రంగా వ్యవహరించేవారు. ఉత్తర కొరియా నుంచి బంగారం, బొగ్గు సహా ఇతర ఖనిజాలు, వస్త్రాలు, పుట్టగొడుగులు.. ఇతర ఆహార పదార్థాలు, ఆయుధాల తయారీలో ఉపయోగించే ముడి పదార్థాలు ఎక్కువగా ఎగుమతి అవుతుంటాయి. వీటి ద్వారా దేశానికి వచ్చే ఆదాయపు లెక్కలను ఈ రూమ్‌ నంబర్‌ 39 చూసుకునేది. అప్పట్లో ఈ గది ఫైనాన్స్‌ అండ్‌ అకౌంటింగ్‌ శాఖలో భాగంగా ఉండేది. 

ఇప్పుడు అక్రమ సంపాదనకు కేంద్రం..

కొన్నాళ్లకు రూమ్‌ నంబర్‌ 39 ద్వారా వచ్చే ఆదాయ వనురుల విషయంలో విభేదాలు వచ్చాయి. దీంతో దీన్ని రూమ్‌ నంబర్‌ 38, 39గా విభజించారు. దేశానికి న్యాయంగా వచ్చే ఆదాయానికి సంబంధించిన విషయాలను రూమ్‌ నంబర్‌ 38 చూసుకుంటుంది. ఇక రూమ్‌ నంబర్‌ 39 ద్వారా అక్రమ వ్యాపారాలు చేస్తూ భారీగా ఆదాయం పొందుతోందని ఉత్తర కొరియాపై ఆరోపణలు ఉన్నాయి. అంతర్జాతీయ మీడియాలో ఈ విషయంపై పలు కథనాలు కూడా వెలువడ్డాయి.

నకిలీ నోట్లు.. మాదకద్రవ్యాలు

గత కొన్నేళ్లుగా ఈ రూమ్‌ నంబర్‌ 39లో పనిచేసే ఏజెంట్లు మాదక ద్రవ్యాలు, నకిలీ కరెన్సీ నోట్ల ముద్రణ, ఆయుధాల అక్రమ రవాణా చేస్తూ.. వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆ దేశ అధ్యక్షుడి విలాసాలకు ఖర్చు చేస్తున్నారని మీడియా తన కథనాల్లో పేర్కొంది. మాదక ద్రవ్యాలను ముఖ్యంగా జపాన్‌, చైనా, ఇతర దేశాల్లో ఎగుమతి చేస్తారట. 2003లో ఆస్ట్రేలియాలో ఉత్తర కొరియా నుంచి వచ్చిన ఓ నౌకను తనిఖీ చేయగా 27మిలియన్‌ డాలర్లు విలువ చేసే హెరాయిన్‌ పట్టుబడటం, 2001 సమయంలో అమెరికాలో 114 మిలియన్‌ డాలర్లు విలువ చేసే 100 డాలర్ల నకిలీ నోట్లు చలామణీ కావడం ఈ కథనాలకు బలం చేకూర్చుతుంది. ఉత్తర కొరియానే ఈ పని చేసినట్లు గుర్తించిన అమెరికా ఏకంగా 100 డాలర్ల నోటు డిజైన్‌ మార్చింది. 

ఏటా ఆదాయం 500 మిలియన్‌ - 2 బిలియన్‌ యూఎస్‌ డాలర్లు

ఆ దేశంలో గనుల నుంచి వెలికి తీసిన బంగారాన్ని చైనాలో అక్రమంగా విక్రయిస్తూ.. ఉత్తర కొరియాకు చెందిన కార్మికులను ఇతర దేశాల్లో పనికి పెట్టిస్తూ రూమ్‌ నంబర్‌ 39 ఏజెంట్లు డబ్బు సంపాదిస్తున్నారట. పలు దేశాల్లో ఉత్తర కొరియా హోటళ్లు ఏర్పాటు చేసి వాటికి వచ్చే లాభాలను రూమ్‌ నంబర్‌ 39కి మళ్లిస్తారట. టెక్నాలజీ విస్తరించిన నేపథ్యంలో ఏజెంట్లు సైబర్‌నేరాలకు కూడా పాల్పడుతున్నారు. పలు సంస్థలకు చెందిన నెట్‌వర్క్‌ను హ్యాక్‌ చేసి డబ్బు డిమాండ్‌ చేయడం.. వారి రహస్యాలను తెలుసుకోవడం వంటివి చేస్తున్నారు. ఈ రూమ్‌ నంబర్‌ 39 ద్వారా ఏటా 500 మిలియన్‌ యూఎస్‌ డాలర్ల నుంచి 2 బిలియన్‌ డాలర్ల వరకు ఆదాయం వస్తోందని సమాచారం. అయితే, గత కొన్నేళ్లుగా ఈ రూమ్‌ నంబర్‌ 39 గురించి తెలుసుకునేందుకు యూఎస్‌ ఇంటెలిజెన్స్‌ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. కానీ, పూర్తి స్థాయిలో సఫలం కాలేకపోతుంది. దేశాధినేతగా వ్యవహరిస్తున్న కిమ్‌.. కేవలం తన విలాసాలకు అయ్యే ఖర్చుల కోసం అక్రమ సంపాదనకు ఒక వ్యవస్థను వినియోగిస్తున్నాడంటే ఆశ్చర్యం కలుగకమానదు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు