Rajya Sabha polls: కర్ణాటకలో క్రాస్‌-ఓటింగ్‌ భయం?.. హోటల్‌కు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు!

కర్ణాటకలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు ఫిబ్రవరి 27న (Rajya Sabha polls) పోలింగ్‌ జరగనుంది. అయితే, మొత్తం ఐదుగురు పోటీలో ఉండటంతో పోలింగ్‌పై ఉత్కంఠ నెలకొంది.

Published : 27 Feb 2024 01:52 IST

బెంగళూరు: కర్ణాటకలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఫిబ్రవరి 27న (Rajya Sabha polls) పోలింగ్‌ జరగనున్న విషయం తెలిసిందే. అయితే, మొత్తం ఐదుగురు పోటీలో ఉండటంతో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్‌కు చెందిన అజయ్‌ మాకెన్‌, సయ్యద్‌ నజీర్‌ హుస్సేన్‌, జీసీ చంద్రశేఖర్‌లు పోటీలో ఉండగా.. భాజపా నుంచి నారాయణ్‌ భాండగే, జేడీఎస్‌కు చెందిన కుపేంద్ర రెడ్డి బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో క్రాస్‌ ఓటింగ్‌ జరగవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు తమ ఎమ్మెల్యేలకు విప్‌ జారీ చేశాయి. ముందు జాగ్రత్తగా కాంగ్రెస్‌ తన ఎమ్మెల్యేలను బెంగళూరులోని ఓ హోటల్‌కు తరలించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అక్కడే శాసనసభా పక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సమాచారం.

కాంగ్రెస్‌కు 134 మంది ఎమ్మెల్యేలు, భాజపా, జేడీఎస్‌కు మొత్తం 85 (66- 19) మంది ఎమ్మెల్యేల బలం ఉంది. మరో నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో తమకు ముగ్గురి మద్దతుందని కాంగ్రెస్‌ చెబుతోంది. అయితే, భాజపా-జేడీఎస్‌ కూటమికి ఒక స్థానంలో గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ.. రెండో అభ్యర్థిని బరిలో నిలపడంతో పోటీపై ఉత్కంఠ నెలకొంది. నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నట్లయితే.. ప్రతి అభ్యర్థి 45 ఓట్లు పొందాల్సి ఉంటుంది. ఎక్కువ మంది పోటీలో ఉన్నట్లయితే ప్రాధాన్యత ఓట్లను పరిగణనలోకి తీసుకుంటారు. భాజపా నుంచి నారాయణ్‌ గెలుపు ఖాయమే అయినప్పటికీ.. భాజపా కూటమి తరఫున బరిలో ఉన్న జేడీఎస్‌ అభ్యర్థి కుపేంద్ర రెడ్డి గెలవాలంటే మరో ఐదు ఓట్లు అవసరం. దీంతో క్రాస్‌ ఓటింగ్‌ జరిగే ప్రమాదం ఉందని కాంగ్రెస్‌ ఆందోళన చెందుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని