Indian Railways: రైలు ప్రమాదాల నివారణ చర్యలపై వివరాలు ఇవ్వండి.. కేంద్రానికి సుప్రీం ఆదేశం

ఆటోమేటిక్‌ ట్రైన్‌ ప్రొటెక్షన్‌ సిస్టమ్‌ ‘కవచ్‌’ తోపాటు రైల్వేలో ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న భద్రతా చర్యల గురించి తెలియజేయాలని భారత సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Published : 02 Jan 2024 15:26 IST

దిల్లీ: భారతీయ రైల్వేలో (Indian Railways) ఇటీవల చోటుచేసుకున్న ప్రమాదాలు తీవ్ర ప్రాణ నష్టాన్ని కలిగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆటోమేటిక్‌ ట్రైన్‌ ప్రొటెక్షన్‌ సిస్టమ్‌ ‘కవచ్‌’ తోపాటు రైల్వేలో ఉన్న భద్రతా చర్యల గురించి తెలియజేయాలని భారత సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) ఆదేశించింది. ఇప్పటికే అమలు చేస్తున్న, ప్రతిపాదిత రక్షణ చర్యల గురించి తెలియజేయాలని సూచించింది. రైల్వేలో ప్రమాదాలు (Train Accidents) నివారించడానికి ‘రైల్వే ప్రమాదాల రక్షణ’ చర్యలు అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ వివరాలను కోరింది.

ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లాలో గతేడాది జూన్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో (Odisha train collision) దాదాపు 290 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో రైల్వే తీసుకుంటున్న భద్రతా చర్యలు వెల్లడించాలని సుప్రీం కోర్టులో ఓ పిటిషన్‌ దాఖలు చేశారు. గత మూడు దశాబ్దాల్లో రైళ్లు ఢీకొట్టడం వల్ల జరిగిన అనేక ప్రమాదాలను న్యాయస్థానం దృష్టికి పిటిషన్‌దారుడు తీసుకెళ్లారు. భద్రతా చర్యలను బలోపేతం చేయడంలో భారతీయ రైల్వే తాత్సారం చేస్తోందని అన్నారు. పిటిషనర్‌ వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం ప్రస్తుతం అమలు చేస్తున్న భద్రతా చర్యలపై వివరాలు తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒకవేళ దేశవ్యాప్తంగా కవచ్‌ను అందుబాటులో ఉంచాలంటే ఆర్థిక ప్రభావం ఏమేరకు ఉంటుందనే విషయంపై కసరత్తు చేశారా? అని ప్రశ్నించింది.

ట్రక్కు డ్రైవర్ల నిరసన.. పెట్రోల్‌ బంక్‌లకు పోటెత్తిన వాహనదారులు

భారతీయ రైల్వేలో ప్రమాదాల నివారణకు ‘రైల్వే ప్రమాదాల రక్షణ’ చర్యలను అమలు చేసేలా ప్రభుత్వానికి నిర్దిష్ట ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ విశాల్‌ తివారీ అనే వ్యక్తి సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిని జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా రైల్వేలో ఇప్పటికే అమలు చేస్తున్న, అమలు చేసేందుకు ప్రతిపాదించిన రక్షణ చర్యల గురించి తెలియజేయాలని అటార్నీ జనరల్‌ను ఆదేశించింది. పిటిషిన్‌ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని