Saina Nehwal: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ‘కిచెన్‌’ వ్యాఖ్యలు.. సైనా నెహ్వాల్‌ ఆగ్రహం

Saina Nehwal: లోక్‌సభ ఎన్నికల్లో మహిళా అభ్యర్థిని ఉద్దేశిస్తూ కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ తీవ్రంగా తప్పుబట్టారు. ఇది నారీశక్తికి అవమానమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated : 30 Mar 2024 16:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ప్రత్యర్థుల పరస్పర విమర్శలతో రాజకీయం వేడెక్కింది. ఈ క్రమంలో కర్ణాటక (Karnataka)లో కాంగ్రెస్‌ (Congress) సీనియర్‌ నేత, ఎమ్మెల్యే శివశంకరప్ప మహిళలపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. భాజపా అభ్యర్థి గాయత్రి సిద్ధేశ్వరను ఉద్దేశిస్తూ ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘ఆమె వంట గదికి మాత్రమే సరిపోతారు’ అంటూ కించపర్చారు. 

ఈ వ్యాఖ్యలపై తాజాగా బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ (Saina Nehwal) సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మహిళలు వంటగదికే పరిమితం అవ్వాలంట - కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శివశంకరప్ప చేసిన వ్యాఖ్యలివి. అమ్మాయిలు పోరాడగలరు అని చెప్పే పార్టీ నుంచి ఇలాంటివి ఊహించలేదు. నేను మైదానంలో ఆడి భారత్‌కు పతకాలు సాధించినప్పుడు.. కాంగ్రెస్‌ పార్టీ ఏం ఆలోచించింది? నేను ఎలా ఉంటే బాగుండేది అనుకుంది? ఓవైపు నారీశక్తికి వందనం అని చెబుతూనే.. మహిళలు పలు రంగాల్లో పెద్ద పెద్ద కలలు కంటున్నప్పుడు ఇలా ఎందుకు కించపరుస్తున్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందింది. మరోవైపు, స్త్రీద్వేష వ్యక్తుల నుంచి మహిళలకు అవమానం జరుగుతోంది. ఇది నిజంగా చాలా బాధాకరం’’ అని సైనా రాసుకొచ్చారు.

శివశంకరప్ప ఏమన్నారంటే..?

కర్ణాటకలోని దేవనగరి లోక్‌సభ స్థానానికి ప్రస్తుత భాజపా ఎంపీ జీఎం సిద్ధేశ్వర ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజా ఎన్నికల్లో కమలం పార్టీ ఈ సీటును సిద్ధేశ్వర సతీమణి గాయత్రికి కేటాయించింది. ఇదే స్థానం నుంచి కాంగ్రెస్‌.. శివశంకరప్ప కోడలు ప్రభా మల్లికార్జున్‌ను నిలబెట్టింది. ఈ క్రమంలోనే కోడలి తరఫున ప్రచారం చేపట్టిన శివశంకరప్ప.. భాజపా నాయకురాలిని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆమెకు సరిగా మాట్లాడటం కూడా రాదు. కేవలం కిచెన్‌లో ఎలా వంట చేయాలో మాత్రమే తెలుసు. ఆమె దానికే సరిపోతారు’’ అని అన్నారు.

ఇది కాస్తా తీవ్ర దుమారానికి దారితీసింది. కాంగ్రెస్‌ నేత వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి భాజపా ఫిర్యాదు చేసింది. 92 ఏళ్ల శివశంకరప్ప హస్తం పార్టీలో అత్యంత వృద్ధ నేత. ప్రస్తుతం ఆయన దేవనగరి దక్షిణం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని