LS polls: సమోసా, చాయ్‌, బిర్యానీ.. అభ్యర్థులు దేనికెంత ఖర్చు పెట్టొచ్చు?

ఎన్నికల వ్యయ పర్యవేక్షణలో భాగంగా ఈ ధరలను ఆయా జిల్లా ఎన్నికల అధికారులు నిర్ణయిస్తారు. పలు రాష్ట్రాల్లో వీటి రేటు కార్డు ఓసారి పరిశీలిస్తే..

Published : 31 Mar 2024 17:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) వేళ రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమ ఖర్చులను పకడ్బందీగా లెక్కపెట్టుకోవాల్సిందే. వీరి వ్యయాలను ఎన్నికల సంఘం (Election Commission) ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. వివిధ రాష్ట్రాల్లో అభ్యర్థులు, పార్టీలు పెట్టే ఖర్చులపై ఈసీ పరిమితులు విధించింది. ఎన్నికల వ్యయ పర్యవేక్షణలో భాగంగా ఈ ధరలను ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు నిర్ణయిస్తారు. పలు రాష్ట్రాల్లో వీటి రేటు కార్డు ఓసారి పరిశీలిస్తే..

పంజాబ్‌లోని జలంధర్‌లో అభ్యర్థులు ఓ కప్పు చాయ్‌కు గరిష్ఠంగా రూ.15 మాత్రమే ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. సమోసాకు అంతే. లస్సీ రూ.20, నిమ్మరసం రూ.15గా నిర్ణయించారు. ఛోలె భటురే రూ.40, చికెన్‌ కేజీ రూ.250, మటన్‌ రూ.500 మాత్రమే. మధ్యప్రదేశ్‌లో టీ కోసం రూ.7 అయితే సమోసా కోసం రూ.7.50 ఖర్చు పెట్టవచ్చు. అయితే, ఇక్కడి బాలాఘాట్‌ ప్రాంతంలో చాయ్‌ కేవలం రూ.5 మాత్రమే. సమోసా మాత్రం రూ.10గా నిర్ణయించారు. ఇడ్లీ, సాంబార్‌ వడ, పోహా-జిలేబీలకు గరిష్ఠంగా రూ.20గా ఖర్చు చేయొచ్చు. దోశ, ఉప్మాలకు మాత్రం రూ.30.

మణిపుర్‌లో ఇటీవల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న థౌబల్‌ జిల్లాలో టీ, సమోసా, కచోరీ, ఖజుర్‌లు రూ.10 మాత్రమే. తెంగ్‌నాపాల్‌ జిల్లాలో మాత్రం బ్లాక్‌ టీ రూ.5 కాగా చాయ్‌కి రూ.10. బాతు మాంసం కేజీ రూ.300. చెన్నైలో మునుపటి లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే చాయ్‌ ధర గరిష్ఠంగా రూ.15, కాఫీ రూ.20కి పెంచారు. చికెన్‌ బిర్యానీ రూ.180గా నిర్ణయించారు.

నోయిడాలోని గౌతమబుద్ధ నగర్‌లో వెజ్‌ భోజనం రూ.100 కాగా కప్పు చాయ్‌ రూ.10, కచోరీ రూ.15, శాండ్‌విచ్‌ రూ.25, కిలో జిలేబీ రూ.90 మాత్రమే. ఉత్తర గోవాలో అభ్యర్థులు గతంలో చాయ్‌ ధర రూ.15 ఉండగా ప్రస్తుతం రూ.20కి పెంచారు. హరియాణా జింద్‌లో మటర్‌ పనీర్ రూ.160, దాల్ మఖ్నా-మిక్స్‌డ్‌ వెజ్‌ కలిపి రూ.130.

కేజ్రీవాల్‌ జైలు నుంచి ప్రకటించిన ఆరు హామీలివే.. ‘ఇండియా’ సభలో వెల్లడించిన సునీత

హెలిప్యాడ్లు, లగ్జరీ వాహనాలు, ఫామ్‌హౌసుల నుంచి పూలు, కూలర్లు, ఏసీ, సోఫాల వరకు రేటు కార్డుల్లో ధరలను నిర్ణయించారు. ఇవే కాకుండా బంతి, గులాబీ దండలకూ ధరలపైనా పరిమితి విధించారు. బహిరంగ సభల ర్యాలీలు, ప్రకటనలు, హోర్డింగులు, కరపత్రాలతోపాటు సభా వేదికల వ్యయ పరిమితులను పొందుపరిచారు.

అభ్యర్థులకు వ్యయ పరిమితి ఉన్నప్పటికీ.. రాజకీయ పార్టీలకు మాత్రం ప్రచార వ్యయంపై పరిమితి లేదు. ఇటీవల ఈసీ జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థి ఖర్చు గరిష్ఠ పరిమితి రూ.95 లక్షలుగా ఉంది. అరుణాచల్‌ ప్రదేశ్‌, గోవా, సిక్కిం వంటి రాష్ట్రాల్లో ఇది రూ.75 లక్షలుగా ఉంది. కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాత్రం అభ్యర్థుల వ్యయ పరిమితి రూ.75 లక్షల నుంచి రూ.95 లక్షల వరకు ఉంది. నామినేషన్‌ వేసినప్పటి నుంచి ఫలితాల వెల్లడి వరకు అభ్యర్థి తన వ్యయ వివరాలను అందజేయాలని ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్‌ 55(1) చెబుతోంది.

ఎన్నికల వేళ సభలు, సమావేశాలకు వచ్చే కార్యకర్తలకు, ఓటర్లకు అభ్యర్థులు లేదా పార్టీలు కనీస సౌకర్యాలు కల్పిస్తుంటాయి. చాయ్‌, సమోసాతోపాటు ఆహారాన్ని అందిస్తుంటాయి. ఇవి కూడా అభ్యర్థులు/పార్టీల ఎన్నికల వ్యయాల్లోనే జమవుతాయి. ఈసీ నిబంధనలకు లోబడే వీటిని ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే, ఓటర్లు, పార్టీ కార్యకర్తలకు మద్యం కూడా అందిస్తుంటాయి.అయితే వీటి వివరాలు వెల్లడించవు. ఇది బహిరంగ రహస్యం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని