PM Modi: మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రత్యేక అతిథులు..ఎవరంటే?

ప్రధానిగా నరేంద్ర మోదీ (Narendra Modi) మూడోసారి ప్రమాణ స్వీకారం చేసేందుకు చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి కొందరు ప్రత్యేక అతిథులను కూడా ఆహ్వానించారు. వారు ఎవరంటే.. నూతన పార్లమెంట్‌ నిర్మాణంలో భాగస్వాములైన శ్రామికులు, ట్రాన్సజెండర్‌లు, పారిశుద్ధ్య కార్మికులు. 

Published : 07 Jun 2024 12:31 IST

దిల్లీ: జూన్‌ 9న మూడోసారి భారత ప్రధానిగా నరేంద్ర మోదీ(Narendra Modi) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు, విదేశీ నేతలు,  ప్రతిపక్ష సభ్యులు, సినీ, క్రీడారంగ ప్రముఖులు, అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలతో సహా మరికొంత మందిని ముఖ్య అతిథులుగా  ఆహ్వానించనున్నట్లుగా అధికారులు తెలిపారు. ఈ జాబితాలో పలువురు ట్రాన్స్‌జెండర్లు, కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి పని చేసిన శ్రామికులు, పారిశుద్ధ్య కార్మికులు, వందే భారత్ రైళ్లు వంటి కీలక ప్రాజుక్టుల్లో పని చేసిన వారికి అవకాశం కల్పించినట్లు తెలిపారు. భారత దేశాభివృద్ధికి తోడ్పడుతున్న వీరందరినీ మోదీ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఇప్పటికే వివిధ దేశాధినేతలు తమకు ఆహ్వానాలు అందినట్లుగా ప్రకటించారు.

‘‘ప్రధానమంత్రి మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత రాజకీయాల్లో చాలా మార్పులు చోటుచేసుకొన్నాయి. బలమైన దేశ నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రతిఒక్కరి సహకారాన్ని ఆయన గౌరవిస్తారు. వీఐపీలు, వీవీఐపీలకు మాత్రమే ఆహ్వానాలు పంపే రోజులు పోయాయి. మా పీఎం అట్టడుగు వర్గాల్లో వారిని కూడా వీఐపీలుగానే చూస్తారు’’ అని కూటమి వర్గాలు తెలిపాయి.

తాను మూడోసారి ప్రధాని పదవిని చేపట్టిన వెంటనే దేశాన్ని మరింత అభివృద్ధి చేయడానికి నిరంతరం కృషి చేస్తానని మోదీ ఎన్నికల ర్యాలీలో ప్రకటించారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబెట్టడమే తన లక్ష్యమని, తాను సమయాన్ని వృథా చేసే వ్యక్తిని కాదని మోదీ ఉద్ఘాటించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని