Electoral Bonds: బాండ్ల వివరాలకు గడువు ఇవ్వండి.. సుప్రీంకోర్టును కోరిన ఎస్‌బీఐ

Electoral Bonds: ఎన్నికల బాండ్ల వివరాల వెల్లడికి గడువు కావాలని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సుప్రీంకోర్టును కోరింది. జూన్‌ 30 వరకు సమయం ఇవ్వాలని అడిగింది.

Published : 04 Mar 2024 20:24 IST

Electoral Bonds | దిల్లీ: ఎలక్టోరల్‌ బాండ్ల వ్యవహారంపై (Electoral Bonds) స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) సుప్రీంకోర్టు (supreme court) తలుపుతట్టింది. బాండ్ల వివరాలు వెల్లడించేందుకు జూన్‌ 30 వరకు గడువు ఇవ్వాలని కోరింది. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు మార్చి 6తో ముగియనున్న నేపథ్యంలో ఈ విజ్ఞప్తి చేసింది. 2019 ఏప్రిల్‌ 12 నుంచి 2024 వరకు మొత్తంగా 22,217 ఎలక్టోరల్‌ బాండ్లు జారీ చేసినట్లు ఎస్‌బీఐ పేర్కొంది. బాండ్లు కొన్నవారు, ఆపై వాటిని రిడీమ్‌ చేసుకున్న వారి వివరాలు మ్యాచ్‌ చేయడానికి కొంత సమయం పడుతుందని తెలిపింది. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి కోర్టు నిర్దేశించిన గడువు అందుకు ఏమాత్రం సరిపోదు కాబట్టి గడువు పొడిగింపు కోరింది.

రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇటీవల సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. పార్టీలకు రహస్యంగా విరాళాలు ఇవ్వడానికి వీలు కల్పించే ఈ పథకం- సమాచార హక్కును ఉల్లంఘించడమే కాకుండా, రాజ్యాంగంలోని 19(1)(ఎ) అధికరణం కింద పేర్కొన్న భావప్రకటన స్వేచ్ఛకు విరుద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. దీనిని వెంటనే నిలిపివేయాలంది. ఎన్నికల బాండ్లు జారీ చేసిన ఎస్‌బీఐ ఆ తేదీ తర్వాత రాజకీయ పార్టీలకు అందిన విరాళాల వివరాలన్నింటినీ కేంద్ర ఎన్నికల సంఘానికి మార్చి 6వ తేదీ లోపు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. వీటిని ఎన్నికల సంఘం మార్చి 13లోపు తన వెబ్‌సైట్‌లో ఉంచాలని స్పష్టం చేసింది. ఈనేపథ్యంలో గడువు కావాలని ఎస్‌బీఐ కోర్టును కోరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు