Electoral Bonds: ఈసీ చేతికి డేటా.. సుప్రీం ఆదేశాలతో దిగొచ్చిన ఎస్‌బీఐ!

ఎలక్టోరల్‌ బాండ్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో దిగివచ్చిన భారతీయ స్టేట్‌ బ్యాంకు ఎన్నికల బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేసింది.

Updated : 12 Mar 2024 19:23 IST

దిల్లీ: ఎలక్టోరల్‌ బాండ్లపై సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన ఆదేశాలతో భారతీయ స్టేట్‌ బ్యాంకు (SBI) దిగివచ్చింది. ఎన్నికల బాండ్ల రూపంలో దేశంలోని పలువురు రాజకీయ పార్టీలకు ఇచ్చిన విరాళాల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘాని(Election Commission)కి అందజేసింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల ప్రకారం.. మార్చి 15 సాయంత్రం 5గంటల్లోగా ఎన్నికల సంఘం కూడా ఈ సమాచారాన్ని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాల్సి ఉంది.

ఎన్నికల బాండ్ల వివరాలను ప్రకటించేందుకు జూన్‌ 30 వరకు అదనపు సమయం ఇవ్వాలంటూ ఎస్‌బీఐ (SBI) దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం మార్చి 11న విచారించింది. ఈ సందర్భంగా ఎస్‌బీఐ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తంచేసిన న్యాయస్థానం.. సమాచారం అందుబాటులో ఉన్నా ఎన్నికల సంఘానికి సమర్పించకపోవడాన్ని తప్పుబడుతూ బ్యాంకు అభ్యర్థనను కొట్టివేసింది. మార్చి 12న బ్యాంకు పనివేళలు ముగిసేలోపు మొత్తం వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించాల్సిందేనని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ మంగళవారం సాయంత్రం ఎన్నికల బాండ్ల వివరాలను ఈసీకి అందజేసింది.

2018లో ఎన్నికల బాండ్ల పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనికింద ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 30 విడతల్లో దాదాపు 28వేల బాండ్లను ఎస్‌బీఐ విక్రయించింది. వీటి మొత్తం విలువ రూ.16,518 కోట్లు. అయితే, ఎన్నికల బాండ్ల ప్రక్రియ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా ఉందని పేర్కొంటూ ‘అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌’ (ఏడీఆర్‌), సీపీఎం, కాంగ్రెస్‌ నేత జయా ఠాకుర్‌ పిల్‌లు దాఖలు చేశారు. వీటిపై విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయి, జస్టిస్‌ జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రలతోకూడిన రాజ్యాంగ ధర్మాసనం ఎన్నికల బాండ్లు చట్టవిరుద్ధమైనవంటూ ఫిబ్రవరి 15న 232 పేజీల తీర్పును ఏకగ్రీవంగా వెలువరించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని