Air Pollution: ‘ఏం చేసినా సరే.. తక్షణమే ఆ పొగ ఆపండి’: వాయు కాలుష్యంపై సుప్రీం సీరియస్‌

Air Pollution: పంట వ్యర్థాల దగ్ధాన్ని తక్షణమే ఆపాలని పంజాబ్‌, రాజస్థాన్‌, యూపీ, హరియాణా రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. దిల్లీలో వాయుకాలుష్యం.. రాజకీయ యుద్ధం కాకూడదని కోర్టు అభిప్రాయపడింది.

Updated : 07 Nov 2023 14:49 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ (Delhi)లో నానాటికీ పెరుగుతున్న వాయు కాలుష్యం (Air Pollution)పై సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. క్షీణిస్తున్న గాలి నాణ్యత.. ‘ప్రజల ఆరోగ్యాన్ని ఖూనీ చేస్తోందని’ ఆవేదన చెందింది. ఈ సందర్భంగా వాయు కాలుష్యంపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం నిందలు వేసుకోవడంపై సుప్రీంకోర్టు సీరియస్‌ అయ్యింది. ఇది రాజకీయ యుద్ధం కాకూడదని సూచించింది. వాయు కాలుష్యానికి ప్రధాన కారణమవుతున్న పంట వ్యర్థాల దగ్ధాన్ని (stubble burning) తక్షణమే ఆపాలని దిల్లీ పొరుగు రాష్ట్రాలను ఆదేశించింది.

దిల్లీ-ఎన్‌సీఆర్‌ (Delhi-NCR) ప్రాంతాల్లో ఆందోళనకర రీతిలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వాల తీరుపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ప్రతి ఏడాది దిల్లీ ఇలా కాలుష్యం కోరల్లో నలిగిపోకూడదు. ప్రతిసారి దీన్ని రాజకీయం చేయకూడదు. పొరుగున ఉన్న పంజాబ్‌ (Punjab), హరియాణా, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దగ్ధాలతో ఏటా శీతాకాలంలో దిల్లీలో కాలుష్యం తీవ్రంగా పెరుగుతోంది. ఈ పంట వ్యర్థాల దగ్ధం ఆగాలి. ఎలా ఆపుతారో మాకు సంబంధం లేదు. అది మీ పని (రాష్ట్ర ప్రభుత్వాలను ఉద్దేశిస్తూ). కొన్ని సార్లు కఠిన చర్యల ద్వారా... మరి కొన్నిసార్లు ప్రోత్సాహకాల ద్వారా.. ఎలాగైనా సరే ఇది ఆగాలి. తక్షణమే జరగాలి. ఈ రోజు నుంచే ఆ పని ప్రారంభించండి’’ అని ఆ నాలుగు రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.

కాలుష్యం ఎఫెక్ట్‌.. 13 నుంచి దిల్లీలో సరి-బేసి విధానం

ఈ సందర్భంగా దిల్లీ ప్రభుత్వానికి కూడా కోర్టు పలు సూచనలు చేసింది. ‘‘దిల్లీ ప్రభుత్వం కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. బస్సులు కూడా కాలుష్యానికి కారణమవుతున్నాయి. వాటిని సగం సామర్థ్యంతో నడపండి. ఘన వ్యర్థాలు బహిరంగ ప్రదేశాల్లో కాల్చకుండా చర్యలు తీసుకోండి’’ అని కోర్టు స్పష్టం చేసింది. సరి-బేసి విధానంపైనా కోర్టు స్పందించింది. ‘ఇలాంటి విధానాలు.. కాలుష్య నియంత్రణపై పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు’ అని అభిప్రాయపడింది. ఇక, పంట వ్యర్థాల దగ్ధాన్ని ఆపే చర్యలపై చర్చించేందుకు.. యూపీ, రాజస్థాన్‌, హరియాణా, పంజాబ్‌, దిల్లీ ప్రభుత్వాలతో కేంద్రం బుధవారం అత్యవసర సమావేశం నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో పాటు, వాహన ఉద్గారాలు, కాలుష్యానికి కారణమయ్యే ఇతర అంశాలపైనా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. అనంతరం దీనిపై తదుపరి విచారణను నవంబరు 10వ తేదీకి (శుక్రవారం) వాయిదా వేసింది.

దిల్లీలో గాలి నాణ్యత విపరీతంగా క్షీణిస్తోంది. దీంతో కాలుష్య నివారణకు ఆమ్‌ ఆద్మీ సర్కారు కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఈ నెల 13 నుంచి 20 వరకు వాహనాలకు సరి-బేసి విధానాన్ని అమలు చేయనున్నారు. అటు విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని పాఠశాలల భౌతిక తరగతుల నిర్వహణను రద్దు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని