RSS March: స్టాలిన్‌కు షాక్‌.. RSS ర్యాలీకి సుప్రీం లైన్‌ క్లియర్‌

తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్‌ ర్యాలీలు (RSS March) నిర్వహించుకునేందుకు లైన్‌ క్లియరైంది. ఈ విషయంపై తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది.

Updated : 11 Apr 2023 16:40 IST

దిల్లీ: తమిళనాడు (Tamil Nadu) ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (RSS) ర్యాలీలపై మద్రాసు హైకోర్టు (Madras HC) ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ స్టాలిన్‌ సర్కారు దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) కొట్టివేసింది. దీంతో తమిళనాట ఆర్‌ఎస్‌ఎస్‌ ర్యాలీలను నిర్వహించుకునేందుకు మార్గం సుగమమైంది.

స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తమిళనాడు (Tamil Nadu) వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించాలని ఆర్‌ఎస్‌ఎస్‌ గతేడాది అక్టోబరులో భావించింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి కోరగా.. భద్రతా కారణాల రీత్యా స్టాలిన్‌ సర్కారు (MK Stalin Govt) అందుకు నిరాకరించింది. దీంతో ఆర్‌ఎస్‌ఎస్‌ (RSS) మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై గతేడాది నవంబరులో విచారణ చేపట్టిన హైకోర్టు.. ఆర్ఎస్‌ఎస్‌ ర్యాలీలకు అనుమతినిచ్చింది. అయితే ఇందుకు కొన్ని షరతులు విధించింది. 60 ప్రతిపాదిత ప్రాంతాల్లో నుంచి 44 చోట్ల మాత్రమే ర్యాలీలు నిర్వహించుకోవాలని, అది కూడా ఇండోర్ స్టేడియాలు, హాళ్లలోనే సభలు ఏర్పాటు చేసుకోవాలని సింగిల్‌ బెంచ్‌ ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే, దీనిపై ఆర్‌ఎస్‌ఎస్‌ (RSS) డివిజన్‌ బెంచ్‌కు వెళ్లగా.. నవంబరు నాటి ఉత్తర్వులను కోర్టు పక్కనబెట్టింది. ఎలాంటి షరతులు లేకుండా ర్యాలీలు (RSS March) నిర్వహించేందుకునేందుకు అనుమతినిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 10న డివిజన్‌ బెంచ్‌ తీర్పు వెలువరించింది. దీంతో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మద్రాసు హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ పిటిషన్‌ దాఖలు చేసింది. ఆర్‌ఎస్‌ఎస్‌ ర్యాలీలను తాము పూర్తిగా వ్యతిరేకించట్లేదని, అయితే నిఘా వర్గాల హెచ్చరికల దృష్ట్యా ప్రతి వీధిలో ర్యాలీలు నిర్వహించుకునేందుకు తాము అనుమతినివ్వలేదని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.

దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. స్టాలిన్‌ సర్కారు పిటిషన్‌ను కొట్టేసింది. ఆరోగ్యకర ప్రజాస్వామ్యానికి ఇలాంటి ర్యాలీలు, ఆందోళనలు ముఖ్యమని పేర్కొంటూ మద్రాసు హైకోర్టు తీర్పును సమర్థించింది. తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్‌ ర్యాలీలు నిర్వహించుకోవచ్చని తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని