Supreme Court: నిరంతర నిర్బంధం.. ఆయనకు మరణశిక్షతో సమానమే!: సుప్రీంకోర్టు

జీవిత ఖైదు అనుభవిస్తోన్న 96 ఏళ్ల వృద్ధుడిని విడుదల చేసే విషయాన్ని పరిశీలించాలని రాజస్థాన్‌ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించింది.

Published : 09 Apr 2024 00:04 IST

దిల్లీ: రాజస్థాన్‌లో 1993 నాటి రైలు బాంబు పేలుళ్ల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తోన్న 96 ఏళ్ల వృద్ధుడిని విడుదల చేసే విషయాన్ని పరిశీలించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు (Supreme Court) సూచించింది. మానవతా కోణంలో ఈ కేసును పరిగణించాలని చెప్పింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన నిరంతర నిర్బంధం.. మరణ శిక్షతో సమానమని పేర్కొంది. వయసు, దిగజారుతోన్న ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకుని తనకు శాశ్వత పెరోల్‌ మంజూరు చేయాలని కోరుతూ హబీబ్‌ అహ్మద్‌ ఖాన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓఖా, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది.

‘‘పిటిషన్‌దారు వైద్య నివేదికలు చూడండి. ఆయన నడవలేరు. కంటిచూపు కూడా సరిగ్గా లేదు. ఈ వయసులో ఆయన ఎక్కడికి వెళ్లగలరు? ఇటువంటి తరుణంలో ఆయన్ను నిర్బంధించడం వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది? ఆయన ఉగ్రదాడి కేసులో దోషిగా తేలిన విషయం వాస్తవమే. కానీ, మరణశిక్ష పడలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనకు జైలుశిక్షను కొనసాగించడం మరణశిక్ష లాంటిదే. 96 ఏళ్ల వయసులో ఆయన తన రోజులు లెక్కబెట్టుకుంటున్నారు. చట్టం అంత కఠినంగా వ్యవహరించకూడదు’ అని రాజస్థాన్ ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ విక్రమ్‌జీత్‌ను ఉద్దేశించి సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

రెమిషన్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, అయితే.. ఉగ్రదాడి కేసులో ఆయనకు శిక్షపడటం దీనికి అడ్డువస్తుందని ఏఎస్‌జీ వాదించారు. ఆర్టికల్‌ 142 కింద సుప్రీం కోర్టు వద్ద ప్రత్యేక అధికారాలు ఉన్నప్పటికీ.. రెమిషన్‌ విషయం రాష్ట్రప్రభుత్వానికి సంబంధించిన అంశమని చెప్పారు. అయితే.. మానవతా కోణంలో ఆయన రెమిషన్‌ అంశాన్ని పరిశీలించాలని ధర్మాసనం తెలిపింది. కేసును రెండు వారాలకు వాయిదా వేసింది.

1993 రైలు బాంబు పేలుళ్ల కేసులో నిందితుడైన హబీబ్‌ అహ్మద్‌ ఖాన్‌.. 1994లో అరెస్టయ్యాడు. 2004లో అజ్‌మేర్‌ కోర్టు అతడిని దోషిగా తేల్చింది. 2016లో సర్వోన్నత న్యాయస్థానం అతడి జీవిత ఖైదు శిక్షను సమర్థించింది. జైపుర్‌ జైల్లో శిక్ష అనుభవిస్తోన్న అతడికి.. 2018, 2020లో 20 రోజులు చొప్పున పెరోల్‌ లభించింది. 2021 ఫిబ్రవరిలో మూడోసారి మూడువారాలకుగానూ పెరోల్‌ మంజూరైంది. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా అప్పటినుంచి సుప్రీం కోర్టు దాన్ని పొడిగిస్తూ వస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని