Supreme Court: కేజ్రీవాల్‌ బెయిల్‌ పొడిగింపు అభ్యర్థన.. అత్యవసర విచారణకు సుప్రీం నో

 ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడానికి బెయిల్‌ను పొడిగించాలని దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ చేసిన అభ్యర్థనపై అత్యవసర విచారణను వెకేషన్‌ బెంచ్ తిరస్కరించింది.

Updated : 28 May 2024 15:10 IST

దిల్లీ: ఎన్నికల ప్రచారం నేపథ్యంలో మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal) పిటిషన్‌పై అత్యవసర విచారణను వెకేషన్‌ బెంచ్ (vacation bench) తిరస్కరించింది.  ఈ కేసుపై ఇప్పటికే చర్చలు జరిగాయని, ప్రస్తుతం తీర్పు రిజర్వ్‌లో ఉందని బెంచ్ తెలియజేసింది. కేసు లిస్టింగ్‌కు సంబంధించిన తదుపరి చర్యలపై సీజేఐ నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది.

కేజ్రీవాల్‌ తరపు న్యాయవాది వేసిన పిటిషన్‌ను వెకేషన్ బెంచ్ విచారించింది. గత వారం మధ్యంతర బెయిల్ మంజూరుచేసిన బెంచ్ అత్యవసర విచారణ గురించి ఎందుకు ప్రస్తావించలేదని కేజ్రీవాల్‌ తరపు న్యాయవాది సింఘ్వీ (Singhvi) ని ప్రశ్నించింది. కేజ్రీవాల్ తన పిటిషన్‌లో బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించిన ముఖ్యమైన వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మధ్యంతర బెయిల్‌ను మరో ఏడు రోజుల పాటు పొడిగించాలని కోరారు. 

మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. తన అరెస్టును సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ ఆలస్యమవుతుండటంతో ఎన్నికల్లో ప్రచారం నిర్వహించుకునేందుకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని అభ్యర్థించారు. దీంతో సర్వోన్నత న్యాయస్థానం మే 10న మధ్యంతర బెయిల్‌ మంజూరుచేసింది. జూన్‌ 2న ఆయన లొంగిపోయి తిరిగి జైలుకు వెళ్లాలని ఆదేశించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని