Arvind Kejriwal: బెయిల్‌ పొడిగింపు అభ్యర్థన.. కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ

మధ్యంతర బెయిల్‌ పొడిగింపు అభ్యర్థన చేసుకున్న ఆప్‌ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు.

Published : 29 May 2024 12:38 IST

దిల్లీ: తన మధ్యంతర బెయిల్‌ అంశంలో ఆమ్‌ఆద్మీపార్టీ(AAP) అధినేత, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు ఊరట లభించలేదు.  బెయిల్‌ను మరో ఏడురోజుల పాటు పొడిగించాలంటూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే పిటిషన్‌ను కోర్టు విచారించే అవకాశం లేదు. ఆ పిటిషన్‌ లిస్టింగ్‌కు సుప్రీం రిజిస్ట్రీ నిరాకరించింది. రెగ్యులర్ బెయిల్‌ కోసం ట్రయల్‌ కోర్టు వెళ్లేందుకు ఆయనకు స్వేచ్ఛ ఉందని, అందుకే ఈ పిటిషన్ విచారణకు అర్హమైనది కాదని వెల్లడించింది. 

మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తన అరెస్టును సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ ఆలస్యమవుతుండటంతో ఎన్నికల్లో ప్రచారం నిర్వహించుకునేందుకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని అభ్యర్థించారు. దీంతో సర్వోన్నత న్యాయస్థానం షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. జూన్‌ 2న తిరిగి జైలుకు వెళ్లాలని ఆదేశించింది. బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మధ్యంతర బెయిల్‌ను మరో ఏడు రోజుల పాటు పొడిగించాలని కేజ్రీవాల్‌ ఇటీవల సుప్రీంను ఆశ్రయించారు. జూన్‌ 9న జైలుకు వెళ్లి లొంగిపోతానని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు