GN Saibaba: ప్రొ.సాయిబాబాకు సుప్రీంలో ఊరట.. విడుదలపై ‘స్టే’కు నిరాకరణ

మావోయిస్టులతో సంబంధాలు ఉన్న కేసులో నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించాలని మహారాష్ట్ర చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది.

Published : 11 Mar 2024 16:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ జి.ఎన్‌.సాయిబాబాకు భారత సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court)లో ఊరట లభించింది. మావోయిస్టులతో సంబంధాల కేసులో అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించాలని మహారాష్ట్ర చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలు పిటిషన్‌ను పరిశీలించిన జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన ధర్మాసనం.. హైకోర్టు ఉత్తర్వులు హేతుబద్ధంగా ఉన్నట్లు ప్రాథమికంగా కనిపిస్తున్నాయని తెలిపింది. అయినప్పటికీ ప్రభుత్వ అప్పీలును విచారణకు స్వీకరిస్తున్నట్లు వెల్లడించింది.

వీలైనంత తొందరగా ఈ పిటిషన్‌ను లిస్టింగ్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వీ రాజు చేసిన మౌఖిక విజ్ఞప్తిని సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. తీర్పును వెనక్కి తీసుకోవడంలో ఎటువంటి తొందరపాటు ఉండకూడదని, అది వేరేలా ఉంటే పరిగణనలోకి తీసుకునేవాళ్లమని తెలిపింది. నిర్ణీత సమయంలోనే ఈ పిటిషన్‌ విచారణకు వస్తుందని స్పష్టం చేసింది. నిర్దోషిత్వం రుజువు చేసుకోవడానికి ఎంతో కష్టపడిన కేసు అని.. సాధారణంగా ఇటువంటి అప్పీల్‌ను ఈ న్యాయస్థానం కొట్టివేసి ఉండాల్సిందని అభిప్రాయపడింది.

ఇదిలాఉంటే, నిషేధిత మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని 90 శాతం వైకల్యంతో వీల్‌ఛైర్‌కు పరిమితమైన సాయిబాబాను, మరో అయిదుగురిని మహారాష్ట్ర పోలీసులు 2014లోనే అరెస్టు చేశారు. ఈ కేసు విచారణను ఎన్‌ఐఏ చేపట్టగా.. 2017లో గడ్చిరోలి సెషన్స్‌ కోర్టు నిందితులందరికీ జీవితఖైదు విధించింది. సెషన్స్‌ కోర్టు తీర్పును సవాలు చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం 2022 అక్టోబరులోనే వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ.. వెంటనే జైలు నుంచి విడుదలకు ఆదేశించింది. ఈ తీర్పు వెలువడిన రోజే మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో నిందితుల విడుదలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. హైకోర్టు తీర్పును 2023 ఏప్రిల్‌లో పక్కనపెట్టింది. నిందితుల అప్పీళ్లపై మళ్లీ మొదట్నుంచీ విచారణ జరపాలని ఆదేశించడంతో మళ్లీ విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు.. సాయిబాబా సహా మిగతా నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ మార్చి 5న తీర్పు వెలువరించింది. దీంతో ప్రొఫెసర్‌ సాయిబాబా విడుదలయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని