Electoral Bonds: ‘ఎవరినో రక్షించడానికే ఎస్‌బీఐ ప్రయత్నం’ - కపిల్‌ సిబల్‌

ఎలక్టోరల్‌ బాండ్లపై రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించిన తర్వాత బ్యాంకు అభ్యర్థనను కోర్టు ఆమోదించడం అంత సులభం కాదని సీనియర్‌ న్యాయవాది, ఎంపీ కపిల్‌ సిబల్‌ పేర్కొన్నారు.

Published : 10 Mar 2024 14:02 IST

దిల్లీ: ఎలక్టోరల్‌ బాండ్ల వ్యవహారంపై స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) సుప్రీం కోర్టు తలుపుతట్టడం అవివేక చర్య అని రాజ్యసభ ఎంపీ కపిల్‌ సిబల్‌ (Kapil Sibal) పేర్కొన్నారు. ఎలక్టోరల్‌ బాండ్లపై (Electoral Bonds) రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించిన తర్వాత బ్యాంకు అభ్యర్థనను కోర్టు ఆమోదించడం అంత సులభం కాదన్నారు. సమాచారాన్ని బహిరంగ పరచడానికి అనేక వారాలు పడుతుందని ఎస్‌బీఐ చెప్పడం ‘ఎవరినో రక్షించేందుకు ఎవరో ప్రయత్నిస్తున్నట్లు’ కనిపిస్తోందన్నారు. గడుపు కోరుతూ ఎస్‌బీఐ వేసిన పిటిషన్‌ను మార్చి 11న సుప్రీం కోర్టు (Supreme Court) విచారించనున్న నేపథ్యంలో సిబల్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

‘వాళ్లు గడువు కావాలని కోరుతున్నారు. కారణాలు సుస్పష్టం. ఈ విషయాలను న్యాయస్థానం పరిశీలిస్తుందని ధీమాగా చెప్పగలను. ఎవరెవరు ఎంతెంత ఇచ్చారనే సమాచారాన్ని సేకరించేందుకు చాలా సమయం పడుతుందని ఎస్‌బీఐ చెబుతోంది. అలా పేర్కొనడం పిల్లచేష్టగా ఉంది. ఎందుకంటే ఇది 21వ శతాబ్దం. ప్రధాని మోదీ చెప్పే డిజిటలైజేషన్‌ కాలమిది’ అని కపిల్‌ సిబల్‌ పేర్కొన్నారు. ఎలక్టోరల్‌ బాండ్లకు సంబంధించి సుప్రీంకోర్టులో దాఖలైన కేసులో పిటిషనర్ల తరఫున వాదనలు వినిపిస్తోన్న ఆయన, ఇదే అంశంపై పీటీఐ వార్తాసంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

‘ఎన్నికల బాండ్లు’ రాజ్యాంగ విరుద్ధం.. సుప్రీం సంచలన తీర్పు

ప్రభుత్వాన్ని రక్షించడమే ఎస్‌బీఐ ఉద్దేశమనే విషయం స్పష్టమవుతోందని కపిల్‌ సిబల్‌ పేర్కొన్నారు. లేదంటే, ఏప్రిల్‌-మేలో సార్వత్రిక ఎన్నికలు ఉన్న వేళ జూన్‌ 30వరకు గడువు ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించదన్నారు. ఒకవేళ ఈ వివరాలను వెల్లడిస్తే రాబోయే ఎన్నికల్లో అదే బహిరంగ చర్చ అవుతుందనే విషయం కూడా ఎస్‌బీఐకి తెలుసునన్నారు. ఇదిలాఉంటే, మార్చి 6లోగా ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలు అందించాలని రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించినందుకు బ్యాంకుపై చర్యలకు ఉపక్రమించాలని కోరుతూ దాఖలైన మరో పిటిషన్‌ను సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ప్రత్యేకంగా విచారించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని