Supreme Court: 48 గంటల్లో పోలింగ్‌ శాతాలపై.. ఈసీ స్పందన కోరిన సుప్రీంకోర్టు

పోలింగ్‌ ముగిసిన 48 గంటల్లోనే పోలింగ్‌ కేంద్రాల వారీగా ఓటింగ్‌ శాతాలను వెల్లడించడంపై స్పందన తెలియజేయాలని ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు సూచించింది.

Published : 18 May 2024 00:09 IST

దిల్లీ: పోలింగ్‌ ముగిసిన 48 గంటల్లోనే పోలింగ్‌ కేంద్రాలవారీగా ఓటింగ్‌ శాతాలను ఎన్నికల సంఘం (Election Commission) వెబ్‌సైట్‌లో ప్రచురించేలా చూడాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే. అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ADR) సంస్థ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారించింది. దీనిపై వారం రోజుల్లోగా స్పందనను తెలియజేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.  మే 24న దీనిపై విచారణ జరుపుతామని తెలిపింది.

ప్రతీ పోలింగ్‌ కేంద్రంలో పోల్‌ అయిన ఓట్ల సంఖ్యను విడివిడిగా ఫారం-17 సి పార్ట్‌ 1 స్కాన్డ్‌ ప్రతుల రూపంలో పొందుపరిచేలా చేయాలని, ఈమేరకు ఈసీకి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఏడీఆర్‌ సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేసింది. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్‌ ఏప్రిల్‌ 19న ముగిసినా, పోలైన ఓట్ల సంఖ్యను 11 రోజుల తరవాత ఏప్రిల్‌ 30న ప్రచురించారు. ఏప్రిల్‌ 26న జరిగిన రెండో దశ పోలింగ్‌ శాతాన్ని నాలుగు రోజుల తరవాత అందుబాటులో ఉంచారు. పోలింగ్‌ రోజున ఎన్నికల సంఘం వెల్లడించిన ఓటింగ్‌ శాతం కన్నా అయిదారు శాతం ఎక్కువగా ఏప్రిల్‌ 30న గణాంకాలు కనిపించాయి. దీనిపై అనుమానాలు తలెత్తుతున్నాయని ఏడీఆర్‌ తమ పిటిషన్‌లో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని