Article 370: జమ్మూకశ్మీర్‌లో ‘ఆర్టికల్‌ 370’ రద్దు రాజ్యాంగబద్ధమే: సుప్రీం కీలక తీర్పు

Article 370: జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లో ఆర్టికల్‌ 370 రద్దు రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ఆ నిబంధన తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని తెలిపింది. అయితే, అక్కడ వీలైనంత త్వరగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్రాన్ని ఆదేశించింది.

Updated : 11 Dec 2023 12:16 IST

దిల్లీ: జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని ‘ఆర్టికల్‌ 370 (Article 370)’ రద్దు రాజ్యాంగబద్ధతను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ఆర్టికల్‌ 370 రద్దు రాజ్యాంగబద్ధమే అని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. ఈ అంశంపై పిటిషనర్ల వాదనను తోసిపుచ్చిన రాజ్యాంగ ధర్మాసనం.. ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది.

‘‘జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)పై కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సవాల్‌ చేయలేరు. భారత్‌లో విలీనం తర్వాత జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక సార్వభౌమాధికారం లేదు. అప్పట్లో యుద్ధ పరిస్థితుల దృష్ట్యా ఆర్టికల్‌ 370ని ప్రవేశపెట్టారు. అది తాత్కాలిక ఏర్పాటు మాత్రమే గానీ.. శాశ్వతం కాదు. దాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది. హక్కుల విషయంలో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేకత ఏమీ లేదు. మిగతా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో అది సమానమే. ఆర్టికల్ 1, ఆర్టికల్‌ 370 ప్రకారం జమ్మూకశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమే’’ అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ తీర్పును వెలువరించారు.

అప్పటిలోగా ఎన్నికలు నిర్వహించాలి..

ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్‌ నుంచి లద్దాఖ్‌ను విభజించి దాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని కూడా సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే, ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రహోదాను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2024 సెప్టెంబరు 30వ తేదీలోగా జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

మానవహక్కుల ఉల్లంఘనలపై దర్యాప్తు జరగాలి

ఆర్టికల్‌ 370 రద్దు అంశంపై రాజ్యాంగ ధర్మాసనం మొత్తం మూడు తీర్పులు వెలువరించింది. సీజేఐ చంద్రచూడ్‌, జస్టిస్‌ గవాయ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌ కలిసి ఒక తీర్పు వెలువరించగా.. జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా మరో రెండు తీర్పులను వెల్లడించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ కౌల్‌ తన తీర్పును వెలువరిస్తూ.. జమ్మూకశ్మీర్‌లో చోటుచేసుకున్న మానవహక్కుల ఉల్లంఘనలపై దర్యాప్తు జరగాలని అన్నారు. ఇందుకోసం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. 1980 నుంచి జమ్మూకశ్మీర్‌లో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనలు, హింసాత్మక ఘటనలపై ఈ కమిషన్‌ దర్యాప్తు చేపట్టాలని పేర్కొన్నారు.

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే 370 ఆర్టికల్‌ను కేంద్రం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జమ్మూకశ్మీర్‌కు చెందిన పలు పార్టీలు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. వాటిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ ఏడాది ఆగస్టు 2 నుంచి సుదీర్ఘంగా విచారణ జరిపింది. సెప్టెంబరు 5న తన తీర్పును రిజర్వులో ఉంచింది. తాజాగా సోమవారం ఆ తీర్పును వెలువరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు