Bye Elections: 26 స్థానాలకు ఉప ఎన్నికలు.. మే 13న కంటోన్మెంట్‌లో

దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఖాళీ అయిన 26 అసెంబ్లీ స్థానాలను భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం (EC) షెడ్యూల్‌ విడుదల చేసింది. తెలంగాణలోని కంటోన్మెంట్‌ స్థానానికి మే 13న ఎన్నిక నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

Updated : 16 Mar 2024 17:01 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఖాళీ అయిన 26 అసెంబ్లీ స్థానాలను భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం (EC) షెడ్యూల్‌ విడుదల చేసింది. మొత్తం ఏడు దశల్లో ఆయాచోట్ల ఉప ఎన్నికలు నిర్వహించనుంది. తెలంగాణలోని కంటోన్మెంట్‌ స్థానానికి మే 13న ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. రాష్ట్రంలో లోక్‌సభ పోలింగ్‌ నిర్వహించే రోజే ఈ ఉప ఎన్నిక జరగనుంది. జూన్‌ 4న ఫలితాలు వెలువడనున్నాయి. భారాస ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణంతో ఈ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే.

ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌లలో అసెంబ్లీ ఎన్నికలు

లోక్‌సభ (Lok sabha Elections)తోపాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా (Odisha), అరుణాచల్‌ప్రదేశ్‌ (Arunachal Pradesh), సిక్కిం (Sikkim) అసెంబ్లీలకూ ఎన్నికల సంఘం (EC) షెడ్యూల్‌ విడుదల చేసింది. ఒడిశాలో నాలుగు దశల్లో, అరుణాచల్‌, సిక్కింలలో ఒకే దశలో పోలింగ్‌ నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

ఏప్రిల్‌ 19 నుంచి లోక్‌సభ పోలింగ్‌

  • ఒడిశాలో మొత్తం 147 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ నాలుగు దశల్లో (మే 13, 20, 25, జూన్‌ 1) అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఇక్కడ బిజూ జనతాదళ్‌ అధికారంలో ఉంది.
  • 60 అసెంబ్లీ సీట్లు కలిగిన అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఏప్రిల్‌ 19న ఒకే దశలో పోలింగ్‌ నిర్వహించనున్నారు. భాజపా, నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ, ఒక స్వతంత్రుడితో కూడిన ఎన్డీయే కూటమి పాలన సాగుతోంది.
  • సిక్కింలో మొత్తం 32 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలోనూ ఏప్రిల్‌ 19న ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. భాజపా, సిక్కిం క్రాంతికారి మోర్చాలతో కూడిన ఎన్డీయే కూటమి అధికారంలో ఉంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని