PUBG Love: పాక్‌ సీమా హైదర్‌.. ‘ప్రీతి’గా చెప్పుకొని భారత్‌లోకి..!

పాకిస్థాన్‌కు చెందిన సీమా హైదర్‌.. ‘ప్రీతి’ అనే నకిలీ పేరుతో భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించినట్లు సమాచారం. ఆమెను నేపాల్‌నుంచి గ్రేటర్‌ నోయిడాకు చేర్చిన బస్సు నిర్వాహకులు ఈ విషయాన్ని వెల్లడించారు.

Published : 21 Jul 2023 02:18 IST

లఖ్‌నవూ: భారత్‌కు చెందిన సచిన్‌ మీనా, పాకిస్థాన్‌కు చెందిన సీమా హైదర్‌ (Seema Haider)ల పబ్‌జీ ప్రేమకథ (PUBG Love)లో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పిల్లలతో కలిసి పాకిస్థాన్‌ నుంచి ముందుగా నేపాల్‌కు చేరుకున్న ఆమె.. తన పేరును ‘ప్రీతి’గా చెప్పుకొని భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించినట్లు సమాచారం. నేపాల్‌లోని పోఖారాలో బస్సు ఎక్కినప్పుడు ఆమె ఇదే పేరు చెప్పినట్లు బస్సు నిర్వాహకులు ఓ జాతీయ వార్తాసంస్థకు తెలిపారు. ఐడీ కార్డు చూపించాలని అడిగినప్పుడు.. తాను భారతీయురాలినేనని, ఆధార్‌ కార్డు కూడా ఉందని ఎటువంటి బెరుకు లేకుండా చెప్పినట్లు వారు వెల్లడించారు.

‘సీమా హైదర్‌.. పోఖారా నుంచి గ్రేటర్‌ నోయిడాకు నాలుగు టికెట్లు తీసుకున్నారు. టికెట్ల కోసం సరిపడా డబ్బులు లేకపోవడంతో భారత్‌లోని ఓ వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడారు. ఈ క్రమంలోనే అతడు మిగతా మొత్తాన్ని యూపీఐ ద్వారా చెల్లించాడు’ అని బస్సు నిర్వాహకులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. మార్చిలో ఓసారి సచిన్‌, సీమాలు నేపాల్‌లో కలుసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలిన విషయం తెలిసిందే. అప్పుడు సైతం నకిలీ పేర్లతోనే తమ హోటల్‌లో బస చేసినట్లు ఆ హోటల్‌ యజమాని ధ్రువీకరించారు.

PUBG Love: పబ్జీ ప్రేమ ఉత్తిదేనా.. ఆమె పాక్‌ ఏజెంటా?

సీమా హైదర్‌, సచిన్‌లను ఉత్తర్‌ప్రదేశ్‌ ఏటీఎస్‌ పోలీసులు రెండు రోజులపాటు విచారించారు. నోయిడా పోలీసులు కూడా విడిగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జాతీయ దర్యాప్తు సంస్థల అధికారులు గురువారం ఈ కేసు విషయంలో నోయిడా పోలీసులను కలిసినట్లు ఓ అధికారి వెల్లడించారు. సీమా కోసం నకిలీ ఆధార్ కార్డును సృష్టించేందుకు సచిన్ ఏం చేశాడనేది తేల్చేందుకు పోలీసులు యత్నిస్తున్నారని చెప్పారు. మరోవైపు.. ఈ వ్యవహారంపై భారత విదేశాంగశాఖ కూడా స్పందించింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ మీడియాతో మాట్లాడుతూ.. ఈ వ్యవహారంపై తమకు సమాచారం ఉందని చెప్పారు. ‘ఆమె ఆరెస్టయి.. బెయిల్‌పై బయటకు వచ్చిన విషయం తెలుసు. ఇది న్యాయపరమైన అంశం. ఈ కేసులో దర్యాప్తు సాగుతోంది. ఏదైనా సమాచారం ఉంటే తెలియజేస్తాం’ అని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని