LS Polls: ఎన్నికల్లో ధన వర్షం.. రోజుకు రూ.100కోట్లు సీజ్‌!

మార్చి 1 నుంచి నిత్యం సగటున రూ.100 కోట్ల విలువైన నగదు ఇతర కానుకలను అధికారులు సీజ్‌ చేస్తున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.

Updated : 15 Apr 2024 16:25 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) అన్ని చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టింది. ఇందులో భాగంగా మార్చి 1 నుంచి ప్రతిరోజూ సగటున రూ.100 కోట్ల విలువైన నగదు ఇతర తాయిలాలను అధికారులు సీజ్‌ చేస్తున్నట్లు ఈసీ వెల్లడించింది. దేశవ్యాప్తంగా కొనసాగుతోన్న తనిఖీల్లో ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ.4,658 కోట్లుగా ఉంటుందని ప్రకటించింది.

2019తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ అని ఈసీ తెలిపింది. అంతేకాకుండా లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ఈ స్థాయిలో ఎన్నడూ తాయిలాలను సీజ్‌ చేయలేదని పేర్కొంది. ఎన్నికల్లో ధనప్రవాహం, ప్రలోభాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ తనిఖీలు ముమ్మరం చేస్తామని చెప్పింది. దేశవ్యాప్తంగా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, నిఘా బృందాలతో సహా సరిహద్దు చెక్‌పోస్టులు నిరంతరం పనిచేస్తున్నామని, మాదకద్రవ్యాల రవాణాతోపాటు నగదు, మద్యం, తాయిలాల పంపిణీని అడ్డుకునేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించింది.

రూ. 2వేల కోట్ల విలువైన డ్రగ్స్‌

ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న రూ.4,658 కోట్ల విలువైన వాటిలో నగదు రూ.395 కోట్లు ఉండగా.. రూ 489 కోట్ల విలువైన మద్యం ఉన్నట్లు ఈసీ తెలిపింది. వీటిలో రూ.2069 కోట్ల విలువైన మాదకద్రవ్యాలే ఉన్నాయని పేర్కొంది. జనవరి, ఫిబ్రవరిలలో దేశవ్యాప్తంగా పట్టుబడిన వాటిలో 75శాతం డ్రగ్స్‌ ఉండటంపై ఈసీ ఆందోళన వ్యక్తంచేసింది. మొత్తంగా 2019 ఎన్నికల సమయంలో రూ.3,475 కోట్లు స్వాధీనం చేసుకోగా.. ఈసారి భారీ స్థాయిలో అక్రమ నగదు, ఇతర తాయిలాలు పట్టుబడినట్లు పేర్కొంది. ఇదిలాఉంటే, ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 1 వరకు మొత్తం ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని