Viral post: ఉద్యోగం చేసుకోవాలి.. మా కుమార్తెను దత్తత తీసుకుంటారా.. ఓ జంట పోస్ట్‌ వైరల్‌

ఇటీవల కాలంలో యువత ఉన్నత చదువులు, ఉద్యోగాలలో పడి తమ వివాహ జీవితాన్ని, పిల్లలను తమ ఎదుగుదలకు అడ్డంకిగా భావిస్తున్నారు.  

Published : 03 Apr 2024 00:05 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: ఇటీవలి కాలంలో యువత ఉన్నత చదువులు, ఉద్యోగ పనిలో పడి వివాహ జీవితాన్ని, పిల్లలను తమ ఎదుగుదలకు అడ్డంకిగా భావిస్తున్నారు. అలాంటి ఓ జంట సామాజిక మాధ్యమం రెడిట్ వేదికగా 3 నెలల కుమార్తె ఎలిజబెత్‌ను దత్తత ఇద్దామనుకుంటున్నట్లు ప్రకటించింది.  దానికి ఆ జంట చెప్పిన కారణం వారు తమ ఉద్యోగాల్లో బిజీగా ఉండడం వల్ల పాపను చూసుకోవడానికి సమయం ఉండట్లేదని.. ఈవిషయాన్ని చిన్నారి తండ్రి నెటిజన్లతో పంచుకున్నారు. తాను, తన భార్య ఆఫీసు పనుల్లో బిజీగా ఉండడం వల్ల  తమ కుమార్తె ఎలిజబెత్‌కు కావలసిన అవసరాలను సమకూర్చడానికి పనిని వదులుకోవాల్సి వస్తుందని, వర్క్‌ హాలిక్‌లైన మేము అలా చేయలేకపోతున్నామన్నారు.

తన భార్య చిన్నారికి పాలు పట్టడం, దుస్తులు మార్చడం, స్నానం చేయించడం తప్ప ఇంకేమీ చేయదన్నారు. ఇప్పటివరకు తామెప్పుడూ ఎలిజబెత్‌తో సమయం గడపలేదని, చిన్నారిని ఆమె అమ్మమ్మ చూసుకుంటున్నారని తెలిపారు.  బిడ్డను ప్రసవించిన రెండు వారాలకే తన భార్య తిరిగి విధుల్లో చేరిందని పనిపై ఆమెకున్న నిబద్దత అలాంటిదని అతడు తెలిపారు. దంపతులు తమ చిన్నారిని ఆమె అమ్మమ్మ కాని, కుటుంబంలోని ఇతరులు కాని దత్తత తీసుకోవాల్సిందిగా కోరారు. వారు ముందుకురాకపోతే ఇతరులెవరికైనా దత్తత ఇస్తామని రెడిట్‌లో పోస్టు పెట్టారు. ఇది కాస్తా వైరల్‌ అవడంతో నెటిజన్లు ఆ దంపతులపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ పోస్టు పిల్లలపై, వారి భవిష్యత్తుపై తల్లిదండ్రులకు ఉండాల్సిన బాధ్యత గురించి నెట్టింట పెద్ద చర్చకు దారి తీసింది. దీనిపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ మీరు ప్రేమాభిమానాలు లేని రోబోలా, లేక మానవ జీవితాలతో ప్రయోగాలు చేస్తున్న గ్రహాంతర వాసులా అంటూ విమర్శించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని