Bomb threat: బెంగళూరులో 44 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

బెంగళూరు (Bengaluru)లో పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. రెండు విడతలుగా ఈ బెదిరింపులు రావడం సంచలనంగా మారింది. 

Updated : 01 Dec 2023 16:08 IST

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు(Bengaluru)లోని పదుల సంఖ్యలో పాఠశాలలకు శుక్రవారం ఉదయం బాంబు బెదిరింపులు( bomb threats) రావడం తీవ్ర కలకలం రేపుతోంది. గుర్తుతెలియని ఒక ఈ మెయిల్ అడ్రస్‌ నుంచి ఈ బెదిరింపులు వచ్చాయని పోలీసులు తెలిపారు. పాఠశాలల్లోనే బాంబులు పెట్టామని సదరు ఈ మెయిళ్లలో పేర్కొనడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వణికిపోయారు. 

నేటి ఉదయం తొలుత ఏడు ప్రైవేటు స్కూళ్లకు ఈ బెదిరింపు మెయిళ్లు రాగా.. ఆ తర్వాత కొద్దిసేపటికే మరికొన్ని విద్యాసంస్థలకు అదే తరహాలో బెదిరింపులు వచ్చాయి. తొలుత ఆ సంఖ్య 15 అని ఉండగా.. తర్వాత 44కు చేరింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులను పాఠశాలలను నుంచి బయటకు పంపించారు. తర్వాత వారు బాంబ్‌స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. వైట్‌ఫీల్డ్, కొరెమంగళ, బసవేశ్వరనగర్‌, యెళహంక, సదాశివనగర్‌లోని పాఠశాలలకు ఈ బెదిరింపులు వచ్చాయి. ఒక స్కూల్‌ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నివాసానికి అతి సమీపంలోని పాఠశాలకు కూడా ఈ మెయిల్ రాగా.. ఆయన స్వయంగా అక్కడకు వెళ్లి దానిని పరిశీలించారు. 

ఈ క్రమంలో ఒక పాఠశాల విద్యార్థి తల్లిదండ్రులకు అడ్వైజరీ జారీ చేసింది. ‘ఈ రోజు మన పాఠశాల అనూహ్య పరిస్థితిని ఎదుర్కొంది. గుర్తుతెలియని వర్గాల నుంచి ఒక మెయిల్ వచ్చింది. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని.. తక్షణమే వారిని ఇళ్లకు పంపివేయాలని నిర్ణయించుకున్నాం’ అని పేర్కొంది.  

గత ఏడాది కూడా బెంగళూరులోని ఏడు పాఠశాలలకు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. అయితే, తర్వాత అవి నకిలీ బెదిరింపులని తేలింది. ప్రస్తుత బెదిరింపులపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇవి కూడా నకిలీ బెదిరింపులే అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, ఈ మెయిళ్లు పంపిన వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు బెదిరింపులు వచ్చిన పాఠశాలల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని