Eknath Shinde-Kunal Kamra: ఆ సెటైర్‌ అర్థమైంది.. కానీ హద్దులు ఉండాలి: ఏక్‌నాథ్‌ శిందే

Eenadu icon
By National News Team Updated : 25 Mar 2025 12:09 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌డెస్క్: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde)ను ఉద్దేశించి స్టాండప్‌ కమెడియన్‌ కునాల్‌ కామ్రా (Kunal Kamra) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యవహారంపై తొలిసారి శిందే స్పందించారు. కమెడియన్ వేసిన సెటైర్ తనకు అర్థమైందని, అయితే దేనికైనా పరిమితి ఉండాలని వ్యాఖ్యానించారు. అలాగే తన పార్టీ కార్యకర్తలు పాల్పడిన విధ్వంసం సరికాదని ఖండించారు.  

ఇటీవల ముంబయిలోని యూనికాంటినెంటల్‌ హోటల్‌లోని హాబిటాట్‌ కామెడీ స్టూడియోలో కునాల్‌ కామ్రా హాస్య వినోద కార్యక్రమం నిర్వహించి దానిని రికార్డు చేశారు. ఇందులో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందేను ‘‘గద్దార్‌’’ (ద్రోహి) గా అభివర్ణిస్తూ ‘దిల్‌తో పాగల్‌ హై’ హిందీ చిత్రంలోని ఒక సినీ గీతానికి పేరడీని కామ్రా ఆలపించడం ఈ వివాదానికి కారణమైంది. ఉప ముఖ్యమంత్రిపై అవమానకర వ్యాఖ్యలు చేశారన్న కారణం చూపుతూ పోలీసులు ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఆ వ్యాఖ్యలకు నిరసనగా హాబిటాట్‌ స్టూడియోపై దాడి చేసి వేదికను ధ్వంసం చేసిన 40 మంది శివసేన కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ పరిణామాలపై మీడియాతో మాట్లాడుతూ శిందే స్పందించారు. ‘‘ఇలాంటి పనులు చేయడానికి ఆయన ఎవరి నుంచి సుపారీ తీసుకుంటారు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ముఖ్యం. కానీ వేరే వారి తరఫున ఇతరుల గురించి తప్పుగా మాట్లాడటం సరికాదు. నా గురించి మర్చిపోండి.. ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి, హోం మంత్రి గురించి ఏం మాట్లాడారో చూడండి’’ అని గతంలో కామ్రా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. అలాగే పార్టీ కార్యకర్తలు చేసిన విధ్వంసంపై మాట్లాడుతూ.. ‘‘శిందే అనే వ్యక్తి చాలా సున్నితమైన మనస్తత్వం కలవాడు. నాపై ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. ప్రతి దానికి నా పనే సమాధానం ఇస్తుంది. నేను విధ్వంసాన్ని సమర్థించను. కానీ పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినడం వల్ల ఇలా జరిగింది. ప్రతి యాక్షన్‌కు రియాక్షన్‌ ఉంటుంది. అయితే ఇలాంటి ఘటనలకు నేను మద్దతు ఇవ్వను’’ అని అన్నారు. 

కామ్రా వ్యాఖ్యల వెనక ఏదైనా కుట్ర ఉందా అని అడగ్గా తనదైన శైలిలో బదులిచ్చారు. ‘‘ ప్రజలు వారికి ప్రతిపక్ష స్థానం ఇచ్చారు. కానీ వారు మాత్రం మారడం లేదు. ఇతరుల గురించి మాట్లాడటం.. అవమానించడం ఒక కుట్ర’’ అని విపక్షాలపై విమర్శలు గుప్పించారు. ఇదిలాఉంటే.. కామ్రా తన వినోద కార్యక్రమాన్ని షూట్‌ చేసిన హాబిటాట్‌ కామెడీ స్టూడియోను బృహన్‌ముంబయి పురపాలక సంస్థ కూల్చివేసిన సంగతి తెలిసిందే. తాను కామెడీ చేయడానికి ఉపయోగించిన వేదికను కూల్చడం సరికాదని కామ్రా స్పందించారు.

Tags :
Published : 25 Mar 2025 11:09 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు