Shivakumar: ‘సీఎం పోస్టు’పై ఖర్గే ఆవేదన.. సమర్థించిన డీకే

Eenadu icon
By National News Team Published : 29 Jul 2025 17:48 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవల ఓ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) మాట్లాడుతూ గతంలో కర్ణాటకలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు తాను శ్రమించినా, పార్టీ అధిష్ఠానం ముఖ్యమంత్రి బాధ్యతలను ఎస్‌.ఎం.కృష్ణకు అప్పగించిందన్న మాటలను కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ (D.K Shivakumar) సమర్థించారు. ఖర్గే కాంగ్రెస్‌ పార్టీ కోసం అవిశ్రాంతంగా పని చేసిన సీనియర్‌ నాయకుడని.. ఆయన తన భావాలను వ్యక్తపరచడంలో ఎటువంటి తప్పు లేదని అన్నారు. అయితే రాజకీయాల్లో ఉన్నవారు తమ భావాలను వ్యక్తపరచవచ్చు కానీ.. అది బహిరంగంగా మాత్రం కాదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. 

కర్ణాటకలోని బేలిమఠంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఖర్గే మాట్లాడుతూ.. తాను ఎన్నడూ అధికారం కోసం వెంపర్లాడలేదన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు తాను శ్రమించినా, పార్టీ అధిష్ఠానం ముఖ్యమంత్రి బాధ్యతలను ఎస్‌.ఎం.కృష్ణకు అప్పగించిందని గుర్తుచేసుకున్నారు. ముఖ్యమంత్రి స్థానం దక్కకపోగా, తన సేవలన్నీ వృథా అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటికీ నిరాశకు గురికాకుండా పార్టీ శ్రేయస్సు కోసం శ్రమించడంతోనే తనకు ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించారని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా..కొంతకాలంగా కర్ణాటకలో సీఎం పదవికి సంబంధించిన విషయంలో పలు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు సిద్ధరామయ్య (Siddaramaiah) డీకే శివకుమార్‌ లేకుండానే విధానసౌధలో ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించడంతో ఇరువురి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయా అని మీడియా డీకే శివకుమార్‌ను ప్రశ్నించింది. దీనికి ఆయన బదులిస్తూ..అవేమీ లేవని అన్నారు. సీఎం నిధుల విషయంలో శాసనసభ్యులతో సమావేశం నిర్వహిస్తున్నారని..అందులో తనకు ఎటువంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు.  బెంగళూరు అభివృద్ధికి సంబంధించిన విషయంలో తాను కూడా కొందరు ఎమ్మెల్యేలతో సమావేశమైనట్లు తెలిపారు. తమ ప్రభుత్వంపై భాజపా చేస్తున్న విమర్శలపై శివకుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని