Shivakumar: సీఎం మార్పు ఊహాగానాల వేళ.. ప్రియాంక గాంధీతో డీకే భేటీ

Eenadu icon
By National News Team Updated : 09 Jul 2025 18:07 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

దిల్లీ: కర్ణాటకలో ‘సీఎం మార్పు’ అంశంపై రాజకీయం ఎంతకీ తెగట్లేదు. ఐదేళ్లూ తానే ముఖ్యమంత్రినని సిద్ధరామయ్య (Siddaramaiah) చెబుతున్నా.. సీఎం కావాలనే తన కోరిక అలాగే ఉందనే అర్థంలో డీకే శివకుమార్‌ (D.K. Shivakumar) బహిరంగంగానే పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో సీఎం మార్పు అంశంపై మళ్లీ కర్ణాటక కాంగ్రెస్‌ నేతల్లో చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో శివకుమార్‌ బుధవారం కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ (Priyanka Gandhi)తో భేటీ అయ్యారు. అనంతరం విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. రాష్ట్రంలో సీఎం మార్పుపై ఊహాగానాలు వస్తున్న వేళ ఈ భేటీ  ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు త్వరలో సిద్ధరామయ్య కూడా కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశమయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 

కర్ణాటకలో రెండున్నరేళ్ల అనంతరం ముఖ్యమంత్రి పీఠం మార్పు ఉంటుందని కాంగ్రెస్‌ అధికారంలో వచ్చినప్పటి నుంచి ప్రచారం జరుగుతోంది. ఐదేళ్ల పాలనలో మొదటి రెండున్నరేళ్లపాటు సిద్ధరామయ్య సీఎంగా ఉంటారని, ఆ తర్వాతి రెండున్నరేళ్లు డీకేను ముఖ్యమంత్రి చేయాలని వారు ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా దాన్నే విశ్వసిస్తున్నారు. ఈ క్రమంలోనే త్వరలో శివకుమార్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టనున్నారని ఇటీవల పలువురు ఎమ్మెల్యేలు, కార్యకర్తలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. 
శివకుమార్‌ సైతం ముఖ్యమంత్రి కావాలనే కోరికతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సీఎం పదవిని ఆశించడంలో తప్పులేదు కదా.. అంటూ తన కోరికను పరోక్షంగా మరోసారి బయటపెట్టారు. దీంతో ముఖ్యమంత్రి పీఠంపై కర్ణాటక రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.

Tags :
Published : 09 Jul 2025 17:13 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని