Sanjay Raut: మోహన్ భాగవత్‌ కుంభమేళాకు ఎందుకు వెళ్లలేదు: సంజయ్‌ రౌత్‌ ప్రశ్న

Eenadu icon
By National News Team Updated : 02 Mar 2025 14:13 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ముంబయి: రాజకీయ నేతలు కుంభమేళా (Kumbh Mela)లో పాల్గొనడంపై శివసేన(శిందే), శివసేన (యూబీటీ) నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాను హిందువునని..ఆ ధర్మాలు పాటిస్తానని చెప్పుకునే శివసేన (యూబీటీ) అధినేత ఉద్దవ్‌ ఠాక్రే (Uddhav Thackeray) కుంభమేళాకు మాత్రం వెళ్లలేదని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde) చేసిన వ్యాఖ్యలను రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ తిప్పి కొట్టారు. భాజపాకి చెందిన నాయకులు అందరూ కుంభమేళాకు వెళ్లినట్లు ఆధారాలు ఉన్నాయా..? అని మండిపడ్డారు.

హిందూ ధర్మ పరిరక్షణ గురించి ప్రజలకు బోధనలు చేసే ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ డాక్టర్ మోహన్ భాగవత్‌ (Mohan Bhagwat) త్రివేణి సంగమంలో ఎందుకు పుణ్యస్నానం చేయలేదని ప్రశ్నించారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ పవిత్ర స్నానం చేస్తున్న ఫొటోలను చూశాను. కానీ, ఆయన పీఎం కాకముందు కుంభమేళాకు వెళ్లినట్లు మాత్రం ఆధారాలు లేవు. ప్రస్తుతం నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ ముఖ్యులైన మోహన్ భాగవత్‌, కేశవ్ బలిరామ్ హెడ్గేవార్, గురు గోల్వాల్కర్, బాలాసాహెబ్ దేవరాస్ వంటివారు పవిత్ర స్నానం ఆచరించినట్లు ఎటువంటి ఫొటోలు బయటకు రాలేదు’’ అని సంజయ్ రౌత్ అన్నారు. తమ పార్టీ నేతలు నకిలీ హిందుత్వ పబ్లిసిటీలను నమ్మరని పేర్కొన్నారు.

ఇటీవల మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ శిందే మాట్లాడుతూ..‘‘కొందరు నేతలు వారు హిందువులని చెప్పుకుంటుంటారు. కానీ, పవిత్ర ఆధ్యాత్మిక కార్యక్రమైన కుంభమేళాను దాటవేశారు’’ అని అన్నారు. కేంద్రమంత్రి రాందాస్‌ ఆఠవలే సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ఉద్ధవ్‌ ఠాక్రే మహాకుంభమేళా(Kumbh Mela)ను సందర్శించకుండా హిందూ సమాజాన్ని అవమానపరిచారన్నారు. అందుకుగాను హిందూ ఓటర్లు వారిని బహిష్కరించాలని.. ఎన్నికల్లో ఆ పార్టీలకు ఓట్లు వేయొద్దని అన్నారు. తరచూ సమావేశాల్లో హిందుత్వం గురించి మాట్లాడే ఠాక్రే ఈ విధంగా ప్రవర్తించడం సరైన చర్య కాదని మండిపడ్డారు.

Tags :
Published : 02 Mar 2025 13:28 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు